పసుపు కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతులు ఆందోళన చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య మాట్లాడుతూ.. ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలో 171 మంది రైతులు సుమారు 126 ఎకరాల్లో పంట సాగు చేశారన్నారు. 40 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. వ్యవసాయ మార్కెట్, మార్కెఫెడ్ అధికారులు నిబంధనల పేరుతో సక్రమంగా పసుపు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు.
ఈనెల 22వ తేదీ నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభించి 33 మంది రైతుల నుంచి 85 టన్నుల పసుపును మాత్రమే కొనుగోలు చేశారన్నారు. చాలా మంది రైతులు యార్డులో పసుపును విక్రయించేందుకు వాహనాల్లో తీసుకురాగా అధికారులు కొనుగోలు చేయకుండా నిలిపేశారన్నారు. మరోవైపు అధికారులు జూన్ ఒకటో తేదీ వరకు మాత్రమే కొనుగోలు కేంద్రం ఉంటుందని ప్రకటనలు ఇవ్వటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి విక్రయానికి తెచ్చిన పసుపు గోదాముల్లో నిల్వ చేసి కొనుగోలు చేయాలన్నారు. పసుపు క్వింటాకు రూ.10 వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.... దుకాణంలోకి దూసుకుపోయిన 2 లారీలు