నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం 16వ వార్డు కౌన్సిలర్ తాళూరు సురేశ్(40) హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కౌన్సిలర్ సురేష్‌కు సోమవారం జన్మదినం కావడంతో కుటుంబ సభ్యులతో తన సొంత వాహనంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం సమయంలో సూళ్లూరుపేటకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలి కారును తీసుకొని రైల్వే క్యాబిన్ రోడ్డులో ఉన్న పార్కింగ్ స్థలానికి వెళ్లారు. ఆయన వెళ్లి గంట దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ పార్కింగ్ స్థలం వద్దకు చేరుకున్నారు.
అక్కడికి వెళ్లి చూడగా సురేష్ శరీరమంతా కత్తిపోట్లకు గురై విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల వారికి తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి:
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తాం: అమరావతి ఐకాస