నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పెన్నానది వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. సోమశిల జలాశయం నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీరు విడుదల అవుతుంటం వల్ల వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీతీరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. నగరంలోని పోర్లుకట్ట, వెంకటేశ్వరపురం, ఈద్గామిట్ట, జయలలితానగర్ ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ప్రవాహం పెరిగితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు వారధి నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
భారీ స్థాయిలో పంట నష్టం ..
రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. వ్యవసాయ, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలపై పెట్టుబడులు పెట్టిన రైతులు తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నారు. 32 మండలాల్లోని 295 గ్రామాల్లో భారీ నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. వరి నారుమళ్లు 2000 హెక్టార్లు, వరినాట్లు 13వేల హెక్టార్లు, మినుములు 12,449, పెసర 12,22 హెక్టార్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 31వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిళ్లినట్లు చెబుతున్నారు. మిర్చి, బొప్పాయి, అరటి, కూరగాయలు, నిమ్మ పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం మొత్తం రూ.43కోట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇంకా నష్టం పెరిగే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
చెరువుకు గండి..
జిల్లాలోని బాలాయపల్లి మండలం చుట్టిలోని పెద్ద చెరువుకు గండిపడింది. నీళ్లు కైవల్య నదిలోకి వృథాగా పోయాయి. గండిని పూడ్చడానికి గ్రామస్థులు చేసిన ప్రయత్నాలేమి ఫలించలేదు. మండలంలో రెండు రోజుల్లో 30 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. నియోజకవర్గంలోనే పెద్దదైన కయ్యూర్ చెరువుతో పాటు అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
పొలాలకు కోత..
స్వర్ణముఖి నది ప్రవాహం ఉగ్రరూపం దాల్చడం వల్ల దాని పరివాహక మండలాల్లోని పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ఉద్ధృతి ఆధికంగా ఉన్న కారణంగా వ్యవసాయ మోటార్లు, తాగునీటి పథకాల పైపులైన్లు కొట్టుకుపోతున్నాయి. పొర్లుకట్ట పనులు పూర్తికాకపోవటం వల్ల నీరు పొలాలోకి చేరి అనంతరం నదిలో కలుస్తున్నాయి. ప్రవాహం ఇంకా కొనసాగుతోంది.
ఊరి చుట్టూ నీరు..
జిల్లాలోని సోమశిల జలాశయమ నుంచి సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. పెన్నా పరివాహక ప్రాంతం సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. ఊరు చుట్టూ నీరు చేరింది. 70 కుటుంబాలు ఎటూ కదలని పరిస్థితి నెలకొంది. అధికారులు బోట్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చిరిదేవరాయ పల్లి, బండారుపల్లి, అప్పారావుపాళెం, కోట్టాలు, కోలగట్ట, సిద్ధాపురం గ్రామాలను నీరు ముంచెత్తింది. స్థానిక ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదీ చదవండి: నివర్ తుపాను ప్రభావం.. సూళ్లూరుపేటలో నిలిచిన రాకపోకలు