Lokesh face to face with youth: చంద్రబాబు హయాంలో రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే.. జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 141వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం బస ప్రాంతంలో యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత, విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్‌కు వివరించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని.. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేశ్ వద్ద వాపోయారు. అవసరమైనన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తానని జగన్ మోహన్ రెడ్డి మోసం చేశాడన్నారు.
సే.. నో టు గంజాయి... ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఒక్క గంజాయికి తప్ప రాష్ట్రంలో మరే ఇతర పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. సే నో టూ గంజాయి అని యువతకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు మేనమామ అన్న జగన్ ఎన్నికల తరువాత కంసమామగా మారాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, కెరియర్ కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా జగన్ మార్చేశాడని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని.. ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు జగన్ తరిమేశాడన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశాడని తెలిపారు.
అధికారుల అత్యుత్సాహం తగదు.. చిత్తూరులో విజయ డెయిరీకి చెందిన వందల కోట్ల ఆస్తులను అమూల్ సంస్థకు అప్పనంగా అప్పగించేందుకు సీఎం జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ కళ్లలో శాడిస్టిక్ ఆనందాన్ని చూసేందుకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, పాడి రైతుల మార్గదర్శి వీరరాఘవులు నాయుడు విగ్రహాన్ని కూల్చడం దారుణం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తమ ఉపాధికి విజయ డెయిరీ తెచ్చిన పెద్దాయన స్మారకంగా విరాళాలు పోగు చేసుకుని పెట్టుకున్న విగ్రహాన్ని కూలగొట్టడం ఉన్మాద చర్య అని లోకేశ్ మండిపడ్డారు. విజయ డెయిరీ ఆస్తులు అమూల్‌కి ధారాదత్తం, డెయిరీ స్థాపనకు కారకుడైన వీరరాఘవులు నాయుడు విగ్రహం విధ్వంసం ఒకేసారి చేపట్టడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మెంటాలిటీకి నిదర్శనమని దుయ్యబట్టారు.