TDP Leaders Inspected Skill Development Center : స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే దమ్ము వైఎస్సార్సీపీకి ఉందా అని నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. విక్రమ సింహపురి వర్సిటీలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించిన నేతలు అక్కడి కంప్యూటర్లు, ఇతర పరికరాలు, సామగ్రిని పరిశీలించారు. కళ్ల ముందే ఆధారాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని పూర్తి ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు సిద్ధమా అని సవాల్ చేశారు.
TDP Leaders in Vikrama Simhapuri University : నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉన్న నైపుణ్య కేంద్రాన్ని తెలుగుదేశం నేతల బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా తెలుగుదేశం నేతలు నైపుణ్య కేంద్రంలో (Skill Development Center) ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పరికరాలు, సామగ్రిని పరిశీలించారు. ఎంత మంది, ఎప్పటి నుంచి శిక్షణ పొందుతున్నారో సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయన్న సమాచారాన్నీ సేకరించారు.
2018లో నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి అనుమతి రాగా.. 2019లో ఏర్పాటైందని అధికారులు వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 90 ల్యాప్‌ట్యాప్‌లతో పాటు ఇతర పరికరాలు, సామగ్రి వచ్చాయని తెలిపారు. వాటిలో 30 ల్యాప్‌ట్యాప్‌లను కావలి పీజీ కళాశాలకు పంపినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని 34 పాలిటెక్నిక్, 6 ఇంజినీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఉన్నాయని పూర్తి స్థాయి మౌలిక వసతులతో నిర్వహిస్తున్నారని తెలుగుదేశం నేతలు అన్నారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే 2.13 లక్షల మంది శిక్షణ తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొన్ని వందల మంది శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు చేసిన కృషికి వచ్చిన అవార్డును తీసుకుని సొంత డబ్బా కొట్టుకున్న జగన్ ఇప్పుడు ఆయనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, అమర్చిన వస్తువులు, ఏయే దేశాల నుంచి వచ్చాయి, ఏ సంస్థ రవాణా చేసింది, చెల్లించిన సొమ్ముకు సంబంధించిన సమస్త సమాచారం తమ వద్ద ఉందన్నారు. మొత్తం 371 కోట్లు ఖర్చు చేసినట్లు తాము నిరూపిస్తామని... కాదని చెప్పగల ధైర్యం వైసీపీ నాయకులకు, ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై అబద్దాలు చెబుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సెంటర్ కనిపించడం లేదా అని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. కేవలం సీఎం కళ్లలో ఆనందం చూడటానికి నిజాలు దాస్తున్నారని ధ్వజమెత్తారు.
TDP Leaders Challenge to YSRCP Leaders : మీడియా సమక్షంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పరిశీలనకు రావాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్‌ని కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సవాల్‌ని స్వీకరించి పరిశీలనకు వస్తే స్కిల్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసు ఎంత అభూత కల్పనో తేలుతుందని తెలుగుదేశం నేతలు అన్నారు.