Summer Coaching Camp At AC Subbareddy Stadium మైదానాల్లో ఆటలాడుకోవడం అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. చదువు కన్న ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రులు మేలుకోక ముందే తెల్లవారజామునే ఆటలాడుకోవడం కోసం పిల్లలు పరుగులు తీస్తారు. అందులోను వేసవి సెలవులంటే పిల్లల ఉత్సాహానికి అవధులు ఉండవు. ఈ కోవలోనే నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నిర్వహిస్తోన్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కు .. చిన్నారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వందలాది మంది చిన్నారులతో సందడిగా మారింది. నెల్లూరు నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల పాఠశాలల విద్యార్ధులు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నారు.
జూన్ 10వ తేదీ వరకు నైపుణ్యాలు : నెల్లూరు జిల్లాలో అనేక పాఠశాలల్లో మైదానాలు లేవు. క్రీడాకారులకు శిక్షణ కోసం అందరూ నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంను ఎంపిక చేసుకుంటారు. సుమారు 19 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ మైదానం వేసవి శిక్షణ శిబిరాలతో సందడిగా మారింది. జూన్ 10వ తేదీ వరకు క్రీడాల్లో నైపుణ్యాలను నేర్పిస్తారు. తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పిల్లలను మైదానానికి తీసుకువస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్నా పిల్లలు మైదానంలో పరుగులు తీస్తున్నారు.
16 క్రీడా విభాగాల్లో శిక్షణ : ఎండలు తీవ్రంగా ఉండటంతో విద్యార్ధులకు అనుకూలంగా ఉన్న ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడిస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో స్టేడియంలో రెగులర్గా 16 క్రీడా విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారనీ ప్రత్యేక శిక్షణ కోసం 900 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారని, అకాడమి పెడితే మంచి క్రీడాకారును తయారు చేయవచ్చునని, వేసవి శిక్షణలో నైపుణ్యలు కనపరిచిన విద్యార్ధులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ యతిరాజ్ చెబుతున్నారు.
అకాడమీ పెడితే బాగుంటుంది : హాకీ, కోకో, కబడ్డీ, టెబుల్ టెన్నీస్, రెజ్లింగ్ , వాలీబాల్, ఫుట్ బాల్, థైక్వాండో ,క్రికెట్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్ధులు ఆటల్లో శిక్షణ పొందుతున్నారు. మైదానంలో అందరం కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు చెబుతున్నారు. శిక్షణలో ఉన్న విద్యార్ధులకు వాకర్స్ అసోసియేషన్ వారు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. హాకీ ఫీల్డుకు ఫెన్సింగ్, స్కేటింగ్ రింగ్, టెన్నీస్ కు ప్రతిపాదనలు పంపినట్లు నిర్వహకులు చెబుతున్నారు. అకాడమీ పెడితే బాగుంటుందని క్రీడాకారులు అంటున్నారు.
"16 క్రీడల్లో రెగులర్గా కోచింగ్ జరుగుతుంది. అమ్మాయిలు, అబ్బాయిల 900 వందల మంది ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అకాడమి పెడితే మంచి క్రీడాకారును తయారు చేయవచ్చు."- యతిరాజ్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్
"సమ్మర్ క్యాంపుకు గత సంవత్సరం నుంచి వస్తున్నాము. సమ్మర్ క్యాంపు చాలా బాగుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 4:45 నుంచి 7 గంటలకు ముగుస్తుంది. వివిధ రకాల ఆటల మంచిగా నేర్పిస్తారు. హాకీ, కోకో, కబడ్డీ, టెబుల్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు."- క్రీడాకారులు
ఇవీ చదవండి