అవినీతి అక్రమాలతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తెదేపా నేత నారా లోకేశ్‌పై వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ నోటికొచ్చినట్లు మాట్లాడటం అధికార పార్టీ నేతల తీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారేతర ప్యాకేజీ 44 కోట్లు మంజూరు చేస్తే.., అదంతా అవాస్తవమని కాకాణి మాట్లాడటం అర్థరహితమన్నారు. మత్స్యకారేతర ప్యాకేజీకి ఇచ్చిన జీవో కాకాణి తయారు చేసిన నకిలీ పత్రాలు లాంటివి కావని ఎద్దేవా చేశారు. తప్పుడు జీవో అయితే రాజీనామా చేస్తానన్న..,కాకాణి ఇప్పుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి లక్ష అరవై వేల మద్యం బాటిళ్లు పంపిణీ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇసుక, గ్రావెల్, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా కరోనాను క్యాష్ చేసుకుంటున్న ఘనత కాకాణికే దక్కుతుందని విమర్శించారు.
ఇదీచదవండి: 'ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం విస్మరించారు'