గ్రామీణ ప్రాంతంలో స్కేటింగ్ అంటే చాలామందికి తెలియదు. తెలిసినా.. ఎక్కువ శ్రద్ధ చూపరు. నెల్లూరు జిల్లా బ్రహ్మదేవం గ్రామంలో మాత్రం చిన్నారులు అద్భుతంగా స్కేటింగ్ చేస్తున్నారు. చుట్టూ పొలాలు, ధాన్యం ఆరబోసుకునే నాపరాయి పరిచిన కళ్లాల్లో రెండేళ్లుగా కాళ్లకు రోలర్లు వేసుకుని పరుగులు తీస్తున్నారు.
ఆరుగురితో మెుదలై..
స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేయాలంటే కనీసం 20లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చా... తమతో ఏం అవుతుందిలే.. అనుకున్నారు జిల్లాలోని బ్రహ్మదేవం ప్రాంతానికి చెందిన ఈ చిన్నారులు. అలాంటి వారికి కోచ్ శరత్.. ఉచితంగా శిక్షణ ఇవ్వడం కలిసివచ్చింది. రెండేళ్ల కిందట ఆరుగురితో శిక్షణ ప్రారంభమైంది. ప్రస్తుతం 80 మంది వివిధ గ్రామాలకు చెందిన వారు బ్రహ్మదేవం వచ్చి స్కేటింగ్లో పోటీ పడుతున్నారు.
పిల్లల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు రోజు శిక్షణకు పంపిస్తున్నారు. అధికారులు రింగ్ నిర్మించలేకపోయినా, విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి గమనించి కొంత ఆర్థిక సహకారంతో క్రీడా ప్రాధికారిత సంస్థ వారు అక్కడే ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. మరోవైపు.. గ్రామంలో స్కేటింగ్ రింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ తెలిపింది.
పోటీల్లో రాణిస్తాం..
ఇక్కడి నుంచి 42 మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. ప్రభుత్వం గ్రామంలో రింగ్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లీ బహుమతులు తెస్తామని ధీమాగా చెబుతున్నారు.