SI Attack on Wife at Court:నెల్లూరు జిల్లా ఆత్మకూరు కోర్టు ఆవరణలోనే ఓ ఎస్సై.. తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన లావణ్య ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జిల్లాలోని సంగం గ్రామానికి చెందిన నాగార్జున.. సమీప బంధువైన లావణ్యను.. 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకు నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ అనంతరం గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్సైగా ఉద్యోగం చేస్తూ..భార్య లావణ్యతో కలిసి కాపురం పెట్టాడు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్య జీవితం సజావుగా సాగింది. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని.. భార్య లావణ్య 2019లో పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగింది. దీంతో పెద్దలు సర్దిచెప్పి ఇద్దరిని కలిపారు. మళ్లీ 15 రోజుల తర్వాత భార్యను వదిలించుకునేందుకు విడాకులు కోసం ఆత్మకూరు కోర్టును ఆశ్రయించాడు. 2019 నుంచి వేరువేరుగా ఉంటూ.. ఆత్మకూరు కోర్టులో వాయిదాలకు హాజరవుతున్నారు.
గుంటూరు జిల్లా గురజాల రూరల్ ఎస్సైగా నాగార్జున విధులు నిర్వర్తిస్తూ.. మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడంటూ భార్య తల్లిదండ్రులు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగార్జునను గత నెల 2న వీఆర్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు వాయిదా కోసం వచ్చి తనపై కోర్టు ఆవరణలోనే ఎస్సై నాగార్జున విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని.. అడ్డొచ్చిన తన తల్లిదండ్రులపై దాడి చేశారని లావణ్య పేర్కొంది. గాయాలపాలైన లావణ్యను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనకు న్యాయం కావాలని.. తను భర్తతో కాపురం చేస్తానని లావణ్య కోరుకుంటోంది.
ఇదీ చదవండి..: HC SUO MOTO: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ