Crimes and Accidents: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్దేవోలు క్రాస్ రోడ్ వద్ద వెళ్తున్న ఓ లారీని వెనక నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉంది. లారీని బలంగా ఢీకొట్టడంతో ఇన్నోవా నుజ్జు నుజ్జు అయింది. ఇన్నోవా వాహనం చెన్నై వైపు వెలుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు.. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఎన్ఆర్ పురానికి చెందిన చంద్ర అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని మెరుగైన చికిత్స మేరకు తిరుపతికి తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..
కృష్ణా జిల్లా విజయవాడ శివారు రామవరప్పాడు వద్ద బుధవారం రాత్రి గుండెపోటుకు గురై ఓ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందారు. గన్నవరం డిపోకు చెందిన సునీత 220 సర్వీసులో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్.. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కండక్టర్ సునీత మరణించారు. మృతురాలికి భర్త, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మరో గంటలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో గుండెపోటుతో ఆమె మృతి చెందిన ఘటనపై డీఎం శివాజీ, పలువురు ఉద్యోగ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
గార్మెంట్స్ వ్యాపారి ఇంట్లో చోరీ..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్‌లోని గార్మెంట్స్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లో ప్రవేశించి.. 15 తులాల బంగారం, రూ.50 వేల నగదుతో పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు కుటుంబ సమేతంగా గత సోమవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వెళ్లాడు. కాగా మంగళవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టినట్లు ఉండటం గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువా పగలుగొట్టి అందులో ఉన్న 15 తులాలు బంగారు నగలు, రూ. 50 వేలు నగదు చోరీకి గురైనట్లు గమనించారు. బాధితుడి కుంటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి ఘటనా స్థలంలో దుండగుల వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రాయదుర్గం అర్బన్ పీఎస్ సీఐ లక్ష్మణ్ తెలిపారు.
ఇవీ చదవండి: