కృషి, పట్టుదల, శ్రమ ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శాప్ ఛైర్మన్ సిద్దార్థ రెడ్డి.. దాదాపు 400 మంది క్రీడాకారులను సత్కరించి, నగదు బహుమతితోపాటు మెమెంటోలు అందజేశారు. ఎవరైనా క్రీడల్లో స్టార్ కావాలంటే కఠోర దీక్షతోపాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. చిన్నతనం నుంచే క్రీడలను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒలంపిక్స్‌లో 7 పతకాలు వచ్చినందుకు గర్వపడాలో.. తలదించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ప్రతిభకు కొదవలేదని.. అయితే దానిని సరైన మార్గంలో పెట్టడంలో విఫలమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ ఫౌండేషన్ ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్రస్థాయిలో ప్రతిభా పురస్కారాలను విజయవాడలో అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
Kishan Reddy: 'క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు పంపుతాం'