JUSTICE SESHASAYANA REDDY COMMITTEE : నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనా స్థలాన్ని విశ్రాంత న్యాయమూర్తితో కూడిన ఏక సభ్య కమిటీ పరిశీలించింది. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభను కందుకూరులో ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. ఘటనా ప్రదేశాన్ని, కాలువను కమిటీ సభ్యులు పరిశీలించారు. తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డితో కూడిన ఏక సభ్య కమిటీ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంయుక్త కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా ఎస్పీ విజయారావు, ఇతర పోలీస్ అధికారులు విచారణ కమిటీతో ఉన్నారు.
గుంటూరులో తొక్కిసలాటపై విచారణ: అలాగే గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటపై విచారణ మొదలైంది. ప్రభుత్వం నియమించిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి ఏకసభ్య కమిటీ గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంది. కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి విశ్రాంత న్యాయమూర్తి అక్కడకు చేరుకున్నారు. కానుకల పంపిణీ కౌంటర్లు, తొక్కిసలాట జరిగిన ప్రదేశం, సభాస్థలిలోకి వచ్చేవారు, వెళ్లేవారి కోసం ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించారు. పరిహారం వివరాలను తెలుసుకున్నారు. సభా ప్రాంగణంలో బందోబస్తు పర్యవేక్షించిన పోలీసు అధికారులతో పాటు బాధిత కుటుంబీకుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.
కందుకూరులో అసలేం జరిగింది: 2022 డిసెంబర్ 28న నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వద్దకు చంద్రబాబు రాత్రి 7:30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు వాహనం వెంట కూడా జనం పెద్దఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్రవాహనాలపై కొందరు పడిపోగా.. వారిపై మరికొందరు పడ్డారు.
అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం నుంచి కార్యకర్తలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రమాదకరంగా ఫ్లెక్సీలపై ఎక్కిన వారిని ఆయన మందలించారు. సభ విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని కోరారు. పోలీసులు సహకరించి కార్యకర్తలను నియంత్రించాలని కోరారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిన విషయాన్ని గుర్తించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి తెలుసుకునే వరకు సభను నిలిపివేశారు. వెంటనే బాధితుల్ని తరలించిన ఆసుపత్రికి వెళ్లారు.
ఇవీ చదవండి: