సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ మృతిపై పలు ఆరోపణలు రావడం వల్ల నెల్లూరు పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా అక్కడ ఆయన మృతి చెందాడు.
మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం కావడం వల్ల కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న సురేష్ అనే వ్యక్తిని నెల్లూరుకు పిలిపించిన పోలీసులు.. కోవూరు స్టేషన్లో విచారించారు. సుమారు 3 గంటలపాటు అతన్ని ప్రశ్నించారు. అయితే విచారణలో సీటుబెల్టు పెట్టుకోకపోవడం వల్లే మహేష్ తీవ్రంగా గాయపడ్డారని..తాను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే బయటపడ్డానని సురేశ్ తెలిపాడు.
రోడ్డు ప్రమాద ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని సురేష్ చెప్పినట్లు సీఐ రామకృష్ణ వెల్లండించారు. ఈ ప్రమాదంపై మరికొందరిని ప్రశ్నించాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలను ఉన్నతాధికారులకు చెబుతామని స్పష్టం చేశారు.
కత్తి మహేష్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇటీవల కోరారు. మహేష్‌కు శత్రువులున్నారని, గతంలోనే ఆయన్ను బెదిరించిన విషయాలు అందరికీ తెలుసన్నారు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడం, వైద్యశాలలో చికిత్స సందర్భంగా తొలుత ఆయన ప్రాణానికి ముప్పు లేదని వైద్యులు చెప్పారని, తర్వాత హఠాత్తుగా ఆయన మరణించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొన్నారు. మహేష్ కరుడుగట్టిన వైకాపా అభిమాని అని, ఆయన గత ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారని, మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అదే బాటలో నడిచినట్లు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: