పేదలకు అన్ని కేటగిరీల ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నగరంలోని 28 డివిజన్లో తెదేపా నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నేతలు లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. హౌస్ ఫర్ ఆల్ కింద నిర్మించిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను.. తాము నిర్మించినట్లు వైకాపా ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు ఉచితంగా ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం 300 చదరపు అడుగులు ఇళ్లే ఇస్తామనటం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టి ఇళ్లను ప్రారంభిస్తే... పేరును మార్చేందుకు వైకాపా ప్రయత్నించటం అన్యాయమన్నారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకపోవటానికి ఒక్క కారణమైనా...వైకాపా ప్రభుత్వం చెప్పగలదా..? అని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. ఇళ్లు మంజూరై రెండేళ్లయినా అవి దక్కక అద్దె ఇంట్లో ఉంటున్న పేదలకు ప్రభుత్వమే అద్దె సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి