Nellore SP Press Meet on Attack on RTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై విచాక్షణారహిత దాడిలో (Attack on RTC Driver) ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ ఇంకా దొరకలేదని.. గాలిస్తున్నామని పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్న ఎస్పీ.. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలించామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ప్రజలను బెదిరించడం, మోసం చేయడం ఈ ముఠా నైజమని.. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. పరారీలో ఉన్న దేవరకొండ సుధీర్‌పై ఇప్పటికై 20 కేసులు ఉన్నాయని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో వెంకన్నపాలెంకు చెందిన బండి విల్సన్‌పై 4 కేసులు.. ఇందిరా నగర్‌కు చెందిన పుట్టా శివకుమార్ రెడ్డిపై 8 కేసులు ఉన్నాయన్నారు.
Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
TDP Leaders Visited RTC Driver in Hospital: దాడిలో తీవ్రంగా గాయపడి.. ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ రాంసింగ్‌ను.. పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. కాగా వీరిని పోలీసులు తొలుత అడ్డుకున్నారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రతో పాటు ఇతర నేతలు వెళ్లగా.. వారికి ఆస్పత్రిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం లోపలికి అనుమతించారు. ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్‌కు అండగా ఉంటామని టీడీపీ నేత కొల్లు రవీంద్ర తెలిపారు.
Protests Against Attack on RTC Bus Driver : మరోవైపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఘనటపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి.. డిపోల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. అదే విధంగా ఏపీ పీటీడీ, ఎన్ఎంయూ నేతలు, ఏపీఎస్ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..: నెల్లూరు జిల్లా కావలిలో ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో ఆర్టీసీ బస్సు డ్రైవరు బీఆర్ సింగ్ హారన్ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో గొడవకు దిగాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు స్పందించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కొంత మంది వ్యక్తులతో కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించి.. డ్రైవరుపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. చంపి పాతిపెడతామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. ఈ ఘటనపై దేవరకొండ సుధీర్‌తో పాటు మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో ప్రస్తుతం ఏడుగురిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.