మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు. అసంతృప్తితో కూడిన భావోద్వేగానికి లోనైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు మంత్రిపదవి రాకపోవడానికి కారణమేంటో అర్థం కావట్లేదని అన్నారు. మొదటి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని ఆశించానని, అప్పుడు మొండిచెయ్యి చూపారని, మళ్లీ విస్తరణలో అయినా వస్తుందని ఆశిస్తే ఇప్పుడూ దక్కలేదని వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు అన్నీ తానై చూసుకున్నానన్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా గడపగడపకూ వెళ్తూ ప్రతి కార్యకర్తనూ కలుస్తున్నా తనకు మంత్రిపదవి రాకపోవడమేంటో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. రాజీనామాలు వద్దని వారిని కోటంరెడ్డి వారించారు.
ఇదీ చదవండి: బజారుకెక్కిన "కేబినెట్ పంచాయితీ".. ఆశావహుల్లో నిరసన జ్వాల!