కరోనా విజృంభిస్తుండటంతో నెల్లూరులో మరోసారి లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 31 తేదీ వరకు నగరంలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసర దుకాణాలకు అనుమతిచ్చారు. ఒంటి గంట తర్వాత నుంచి దుకాణాలన్నీ మూతపడగా, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు రాకపోకలను నిషేధిస్తున్నారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులు మాత్రం స్వల్ప సంఖ్యలో తిరుగుతున్నాయి. కరోనాను నిర్మూలించేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్త వహిస్తూ, లాక్ డౌన్ కు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
అటు జిల్లాలోని సంగంలోనూ శనివారం నుంచి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు బుచ్చిపాలెం సీఐ సురేశ్ బాబు తెలిపారు. దుకాణదారులు ఉదయం 6 నుండి 11 వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోవాలని సూచించారు. 11 గంటల అనంతరం ఎవరైనా లాక్ డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.