Nellore Missing Child Dead Body In Canal : నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలోని ఏడాదిన్నర చిన్నారి హారిక అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. చిన్నారి ఏదో చోట ఉంటుందనే ఆశతో గాలించిన కన్నవారు.. చూసి తట్టుకోలేని దృశ్యాలే వారి కంట పడ్డాయి. మూడు రోజులుగా చిన్నారి కనిపించటం లేదని వెతికినా తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలింది. తల్లి పక్కన ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి ఆదృశ్యమై.. కాలువలో విగతజీవిగా మారిన తీరు స్థానికుల చేత కంటతడి పెట్టించింది. చిన్నారి మృతిలో రక్త సంబంధీకుల పాత్ర ఉందనే పోలీసులు అనుమానం సంచలనంగా మారింది.
నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో మూడు రోజుల క్రితం ఊయలలో నిద్రిస్తూ అదృశ్యమైన చిన్నారి మృతదేహం సర్వేపల్లి కాలువలో లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలోని అనూష తన చిన్న కుమార్తె కనిపించటం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదృశ్యమైన తీరును చిన్నారి తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఊయలలో పడుకోబెట్టిన చిన్నారి స్థానంలో రెండు బొమ్మలను ఉంచి.. ఎవరో ఎత్తుకెళ్లినట్లు చిన్నారి తల్లి పోలీసులకు వివరించింది. చిన్నారి అదృశ్యంపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామస్థులను, బంధువులను, కుటుంబ సభ్యులను విచారించారు. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు స్థానికుల సాయంతో సర్వేపల్లి కాలువలో వెతికారు. ఆచూకీ లభించకపోవటంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈతగాళ్లకు చిన్నారి మృతదేహం కాలువలో లభించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంతోషంగా వారి మధ్య తిరిగిన చిన్నారి విగతజీవిగా కాలువలో లభ్యం కావటాన్ని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
చిన్నారి హారిక మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి వెనక రక్త సంబంధికుల హస్తం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని.. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వివరించారు. దర్యాప్తు పూర్తైన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా ముక్కు పచ్చలారని చిన్నారిని ఎవరో కావాలనే హత్య చేశారని.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి :