నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సోమవారం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఏఎస్ పేట మండల తహసీల్దార్ లక్ష్మీ నరసింహం అధికార పార్టీ నేత, రాజవోలు అగ్రికల్చర్ సిండికేట్ ఫార్మసీ సొసైటీ (ఏఎస్ఎఫ్ఎస్) ఛైర్మన్ కాటంరెడ్డి నరసింహారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. 'మీ కార్యాలయంలో మాకు ఏ పనులు చేయడం లేదు మీ వ్యవహారాలు అన్నీ నేను వీడియో తీశాను.. వాటిని బయట పెడతాను' అంటూ నరసింహారెడ్డి బెదిరింపులకు దిగారు. దీంతో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం కూడా అంతే తీవ్ర స్థాయిలో నరసింహరెడ్డితో వాదించారు. 'నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో బయటపెట్టు.. అవి ఏంటో చూస్తామంటూ' వాదనకు దిగారు. మంత్రి కార్యక్రమ వేదిక వద్దనే మండల స్థాయి అధికారితో పార్టీ నేత వాదనకు దిగి నీ అంతు చూస్తా అంటూ గొడవకు దిగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
కార్యాలయంలో ఏ పనులు చేయడం లేదని ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని నరసింహారెడ్డి ఆరోపించారు. అక్రమంగా పనులు చేయమని నరసింహారెడ్డి రోజూ బెదిరిస్తున్నారని తహసీల్దార్ ఆక్షేపించారు. ఏదేమైనా మంత్రి ఇలాకాలో.. అందులో ఆయన హాజరైన కార్యక్రమంలో ఓ సొసైటీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి తహసీల్దార్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇద్దరూ తీవ్రస్థాయిలో బహిరంగంగా గొడవకు దిగడం చర్చనీయాంశం అయ్యింది. నరసింహారెడ్డి గత నెలలో ఓ గ్రామంలో పనులు పరిశీలన సమయంలో జిల్లా అధికారులతో కూడా వాదనకు దిగారని తెలుస్తోంది.
ఇదీ చదవండి : కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ