రెండో విడత అమ్మఒడి పథకాన్ని ఈ నెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అదేరోజున పిల్లల్ని చదివిస్తున్న అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇచ్చే 15 వేల రూపాయలలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం వెయ్యి రూపాయలు మినహాయించుకుని.. 14 వేలు రుపాయలు విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని, ఆయాలకు జీతభత్యాలు, నిర్వహణ కోసం దీన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు పాఠశాలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే సీఎం కోరారని తెలిపారు. రెండో విడత జగనన్న అమ్మఒడి పథకాన్ని సమీక్షించిన సీఎం.. అర్హత ఉన్న ప్రతి తల్లికి పథకాన్ని వర్తింపజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కులాలు మతాలు వివక్షకు తావులేకుండా పథకం వర్తింపజేస్తామని, స్కూళ్లు, గ్రామ వార్డు సచివాలయాల్లో అమ్మఒడి అర్హుల జాబితా ప్రదర్శిస్తామన్నారు. పథకం దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండో శనివారం, ఆదివారం బ్యాంకు సెలవులు ఉన్నందున ఈనెల 9కి బదులు 11న అమ్మఒడి డబ్బు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
'సాక్ష్యాలను చెరిపేశారు...క్రైస్తవుడితో విచారణ చేయిస్తున్నారు'