నెల్లూరు జిల్లా వాసులు జనతా కర్ఫ్యూకి సంఘీభావం తెలిపారు. ఫలితంగా జిల్లాలోని అన్నీ ప్రధాన కూడళ్లన్నీ బోసిపోయాయి.
నిర్మానుష్యంగా మారిన నెల్లూరు నగరం
కరోనా కర్ఫ్యూతో నెల్లూరు నగరం నిర్మానుష్యంగా మారింది. ప్రధాని మోదీ పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లన్నీ బోసిపోయాయి. స్వల్ప సంఖ్యలో మెడికల్ షాపులు తప్ప మిగిలిన అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపిన గూడూరు ప్రజలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, ఆర్టీసీ బస్సు ప్రాంగణం, నేషనల్ హైవే, రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేస్తూ అవగాహన
కరోనా వైరస్‌ని అరికట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూ నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. జైపూర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం రావటంతో, అతడిని నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద పోలీసులు గుర్తించి పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ, కరోనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కావలిలో కాలీగా మారిన ప్రధాన కూడళ్లు
ప్రధాన మోదీ పిలుపుమేరకు కావలిలో ప్రజలు జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపారు. ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని పలు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ స్వచ్ఛందంగా మూసివేశారు.
తామున్నామంటూ ప్లకార్డులతో ప్రదర్శన
జనతా కర్ఫ్యూలో భాగంగా ఆత్మకూరులో ప్రధాన కూడళ్లన్నీ బోసిపోయాయి. స్థానిక ఆర్డీవో ఉమాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రావు, సీఐ పాపారావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బంది వీధుల్లో తిరుగుతూ పర్యవేక్షించారు. ప్రజలకు తాము అండగా ఉన్నామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.