నెల్లూరు జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు అధ్వానంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా అసంపూర్తి భవనాలతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మార్చి 20 నుంచి మూతపడ్డాయి. ఇటీవల వీటిని పునఃప్రారంభించారు. ఈ వ్యవధిలో మరమ్మతులు చేస్తే బాగుండేది. మరమ్మతులు చేయని కారణంగా శిథిలావస్థకు చేరినట్టుగా పాఠశాలల భవనాలుగా దర్శనమిస్తున్నాయి.
బీసీ సంక్షేమం ఇలా..
జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు 79, కళాశాల వసతిగృహాలు 21 ఉన్నాయి. వీటిలో గత సంవత్సరం 8966 మంది విద్యార్థులు ఉన్నారు. 62 ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. రెండేళ్లుగా మరమ్మతులు చేయనందునా అధ్వానంగా మారాయి. గతంలో 45 వసతిగృహాలను గుర్తించి రూ.2.43 కోట్లు కేటాయించారు. ఈ పనులు అంతంతమాత్రంగా చేశారు. 40 చోట్ల మరుగుదొడ్లు, 50 వసతి గృహాల్లో తాగునీరు, ప్రహారీల సమస్య ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. చిట్టమూరు బీసీ బాలుర వసతిగృహం అధ్వానంగా మారింది. కొత్తపాళెం బీసీ బాలుర వసతిగృహం గచ్చు పగిలిపోయింది. కావలి బాలుర-2 వసతి గృహాం అధ్వానంగా ఉంది. కోవూరులోని బీసీ బాలికల వసతిగృహంలో చేపట్టిన రెండు అదనపు గదుల నిర్మాణం ఆసంపూర్తిగా ఉంది. ఇక్కడ 180 మంది విద్యార్థినులు ఉన్నారు.
సాంఘిక సంక్షేమ వసతిగృహాలూ అంతే..
జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ప్రీమెట్రిక్ 73, కళాశాల వసతిగృహాలు 14 ఉన్నాయి. వీటిలో 7994 మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరం ఉన్నారు. ప్రభుత్వ భవనాలు 83 ఉన్నాయి. 2018-19 రూ.3.53 కోట్లతో 2019 ఆగస్టులో పనులు చేశారు. అయినా ఎన్నో చోట్ల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి.
ప్రీ, పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 25 ఉన్నాయి. వీటిలో 18 గురుకులాలుగా నడుస్తున్నాయి. 16 భవనాలకు నాడు-నేడులో రూ.4,07,52,557 కేటాయించారు. నెల్లూరులోని పొదలకూరు రోడ్డు బాలికల వసతి గృహంలోనే గురుకులం నడుస్తోంది. ఇరుగ్గా ఉండడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేటలో భవనాలు మరమ్మతులకు గురయ్యాయి.
ఇదీ పరిస్థితి...
నెల్లూరులోని కొండాయపాలెం గేటు బాలుర వసతిగృహానికి రంగులు వేసి వదిలేశారు. గచ్చు పాడైంది. శ్లాబు పెచ్చులూడిపోయింది. మద్రాసు బస్టాండ్ వద్ద అయిదు బాలికల వసతిగృహాల భవనాల గోడలకు పగుళ్లు వచ్చాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటిలో 800 మందికిపైగా బాలికలు ఉంటారు. నీటి వసతి కూడా లేదు. మనుబోలు ఎస్సీ బాలురు, మర్రిపాడులోని బాలుర, బాలికలు, సీతరామపురంలో బాలురు, కలిగిరిలోని సిద్ధనకొండూరు బాలురు వసతిగృహాలు మరమ్మతులకు గురయ్యాయి. కోవూరు బాలికల వసతిగృహం ప్రహారీ గోడ కూలిపోయింది.
మరమ్మతులకు చర్యలు...
వసతిగృహాల మరమ్మతులకు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాం. ఇంకా మరమ్మతులకు ఉత్తర్వులు రాలేదు. నాడు-నేడు పథకంలో ఈ భవనాలు బాగుచేసే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం పనులు చేయలేదు.- బీసీ సంక్షేమశాఖ అధికారి వెంకటయ్య
గత సంవత్సరం కొంతమేరకు పనులు చేశాం. ఈ ఏడాది పనులు చేయలేదు. ప్రభుత్వం నుంచి మరమ్మతులకు ఉత్తర్వులు రాలేదు. శానిటైజేషన్ చర్యలు తీసుకుంటున్నాం.- సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్
ఇవీ చూడండి...