Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎడతెరిపిన వర్షాలు కురుస్తున్నాయి. కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సత్రం, చెన్నై పాలెం తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. పది మీటర్ల మేర సముద్ర అలలు ముందుకు వచ్చాయి. మత్స్యకారులు వారి బోట్లు వలలను సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు. అదేవిధంగా కావలి పట్టణం ప్రాంతంలోని వైకుంటపురం, జనతాపేట, బాలకృష్ణారెడ్డి నగర్, ముసునూరు, సంకలవారి తోట పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నడుములోతు మురికి నీటిలో తేళ్లు, విషసర్పాల భయంతో చిన్నారులు, మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంత ప్రమాదమైనా ఏ ఒక్క అధికారి కూడా తమ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు.
గుడ్లూరు మండలంలో ఉప్పుటేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీని కారణంగా గుడ్లూరు - బసిరెడ్డిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కావలిలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే నెల్లూరులోని పలు కూడళ్లల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. హరినాథపురం కూడలి, పొదలకూరు, డైకస్ రోడ్లపై వర్షపు నీరు నిండిపోయింది. వర్షం కారణంగా పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ కళాశాల భవనంపై పిడుగుపడింది. పిడుగుపాటుకు కళాశాలలో ఫ్యాన్లు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోగా, స్వల్పంగా కళాశాల భవనం గోడ దెబ్బతిన్నది. ఈ రోజు సెలవు కావడంతో పెనుప్రమాదం తప్పింది. వెంకటగిరి నియోజకవర్గంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిరుపేదల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వాతావరణ శాఖ గత కొద్దిరోజులుగా హెచ్చరిస్తున్నా ముందస్తు జాగ్రత్తలు చేపట్టని అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.