నెల్లూరులో ఓ బాలుడి కిడ్నాప్‌నకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధమున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈనెల 3వ తేదీన సాయంత్రం నెల్లూరులోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో సైకిల్ తొక్కుతున్న అక్షిత్ అనే బాలుడిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై బలవంతంగా బాలుడిని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... స్థానికులు గుర్తించి ఒకరిని పట్టుకోవటంతో కిడ్నాప్ ప్రయత్నం విఫలమైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన దర్గామిట్ట పోలీసులు... హరీష్ రెడ్డి, శివకుమార్, పవన్, హేమంత్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ధనవంతుల పిల్లలను కిడ్నాప్ చేసి, బ్లాక్ మెయిల్ ద్వారా డబ్బు సంపాదించేందుకు ఇలా చేశారని నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. రెండు రోజులపాటు రెక్కి నిర్వహించిన వీరు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని తెలిపారు.