నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఉద్యాన, వ్యవసాయ పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో 32 మండలాల్లో 295 గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి. వరి 15 వేల హెక్టార్లు, మినుము 13 వేల హెక్టార్లు, పెసర 1250 హెక్టార్లు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 32 వేల ఎకరాల దెబ్బతిన్నాయని 45 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉద్యాన, వ్యవసాయ పంటలు మొత్తం రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఈ వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెన్నా నది వరద పెరుగుతుండటంతో.. నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే వెంకటేశ్వరపురం, జయలలితానగర్, పొర్లుకట్ట, అహ్మద్ నగర్ ప్రాంతాలు ముంపునకు గురికాగా, తాజాగా పుత్తా ఎస్టేట్, మనుమసిద్ధి నగర్ ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. ఈ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో.. సోమశిల జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటిని తగ్గించినప్పటికీ..నెల్లూరులో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది.
నెల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న మంత్రి, బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే