FARMERS PROTEST : ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని ఆక్రమించారని, న్యాయం జరిగే దాకా పోరాడతామంటూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పొంగూరు కండ్రిగ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఎండను లెక్కచేయకుండా మధ్యాహ్నం 12.30 నుంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 1976లో ప్రభుత్వం సీజేఎఫ్‌ఎస్‌లో తమకు భూమి ఇచ్చిందన్నారు. 2018లో సీజేఎఫ్‌ఎస్ పట్టాలు రద్దు చేసి డి పట్టాలు మంజూరు చేసే క్రమంలో అప్పటివరకు ఆన్‌లైన్‌లో ఉన్న తమ పేర్లు తీసేసి ప్రభుత్వభూమిగా మార్చారన్నారు.
అయినా పొలాన్ని తాము సాగుచేసుకుంటున్నామని, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ భూమి తనకు వారసత్వంగా సంక్రమించిందని చెబుతూ తమను పొలంలోకి వెళ్లనీయడం లేదని వాపోయారు. తమపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. 1978లో తాలూకా రికార్డుల్లో, 2009లో అడంగల్‌లో తమ పేర్లు నమోదయ్యాయని ఆధారాలు చూపిస్తున్నా ప్రస్తుతం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిరసన తెలుపుతున్న సమయంలో ఎండ తీవ్రతకు మూలి రమణమ్మ అనే వృద్ధురాలు స్పృహ కోల్పోగా తోటివారు సపర్యలు చేయడంతో కోలుకున్నారు. బుధవారం రాత్రి రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని నిరసన కొనసాగించారు.
ఇవీ చదవండి: