నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో వరిసాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వానికి పంటను అమ్మి రెండునెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు రాలేదు. అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టామని..చాలా ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంటకాలం ప్రారంభమవుతుండటంతో ఖర్చులకు డబ్బులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల కార్యాలయంలో అర్జీలు పెట్టుకుంటున్నారు.
జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేశారు. 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ప్రభుత్వం మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ తెలిపారు.
ఎన్నో కష్టాలు పడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే నేటికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలకు వెళితే సివిల్ సప్లై ఆఫీస్‌కి వెళ్లండని..... అక్కడికి వెళితే సొసైటీలకు వెళ్లండంటూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల కోసం బంగారు నగలు తాకట్టు పెట్టామని.. అప్పు ఇచ్చినవారు పదే పదే అడుగుతున్నారని.. ఏమి చేయాలో తోచని పరిస్థితి ఉందన్నారు.
జిల్లాలోని 10,942 మంది రైతులు వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.557 కోట్లు కాగా..రూ. 485 కోట్లు విడుదలకి అనుమతిచ్చారు. ఇప్పటికి రూ.366 కోట్ల నగదు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇంకా రూ.119 కోట్లు చెల్లించాల్సి ఉంది. వారం పది రోజుల్లో ఈ మొత్తాన్ని కూడా జమ చేస్తాం
-రోజ్మండ్ జిల్లా సివిల్ సప్లై మేనేజర్
ఇదీ చదవండి: