దేశ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది నెల్లూరు రొట్టెల పండుగ. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో బారాషాహీద్ దర్గా.. స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ నిర్వహిస్తారు. ఐదు రోజులు జరిగే ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరు అవుతుంటారు. కొవిడ్‌తో నేడు ఆ పరిస్థితి మారింది.
కొవిడ్ నిబంధనలతో వేడుకలు రద్దు..
కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను రద్దు చేసింది. తక్కువమందితో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించేలా (19th) ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేశారు. బయట వ్యక్తులు రాకుండా, కొందరికి మాత్రమే అనుమతి ఇస్తూ భారీకేడ్లు ఏర్పాటు చేశారు. జనసంద్రంగా ఉండాల్సిన స్వర్ణాల చెరువు స్నానాల ఘాట్లు వెలవెలబోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు భక్తులు.. కొవిడ్ నిబంధనల కారణంగా వెనుదిరుగుతున్నారు.
బారా షాహీద్ దర్గాలో 23వ తేదీన అమరుల సమాధులకు గంధోత్సవం నిర్వహించడానికి 20 మందికి మాత్రమే అధికారులు అనుమతులు ఇచ్చారు. కేవలం దర్గా కమిటీ సభ్యుల సమక్షంలో చేసేందుకు నిర్ణయించారు.
రొట్టెల పండుగ విశిష్టత..
భక్తులంతా స్వర్ణాల చెరువు వద్ద కుల మతాలకు అతీతంగా కలిసిపోతారు. నిండైన విశ్వాసం, భక్తి భావంతో కోర్కెలు తీరాలని కోరుకుంటారు. తీరిన కోర్కెలను వచ్చి చెప్పుకుంటారు. కోర్కెలు తీరిన వ్యక్తి రొట్టెను పంచుతుండగా.. అలాంటి కోరికే తీరాలనుకునే మరో వ్యక్తి ఆ రొట్టెను అందుకుంటాడు. తిరిగి తన కోరిక నేరవేరాక.. రొట్టెను మరో ముగ్గురుకి పంచుతాడు. స్వర్ణాల చెరువు వేదికగా ఆ అల్లాను స్మరిస్తూ నిండైన మనసుతో భక్తులు ఈ రొట్టెను పట్టుకుంటారు. విద్యా రొట్టె, సౌభాగ్య, సంతాన,ఆరోగ్యం వంటి రొట్టెలు పట్టుకుంటారు. ఆ అల్లాను ప్రార్థించి రొట్టెను అందుకొని తింటే.. తమ కోరికలు నేరవేరతాయని.. అవి నేరవేరాక తిరిగి రొట్టెను పంచుతామని అక్కడి భక్తులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ.. ONLINE COMPLAINT: సైబర్ నేరాలపై ఆన్లైన్ ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ