రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ ధోరణిలో మాత్రం ఏ మార్పు రావడంలేదని నెల్లూరులో మండిపడ్డారు.
హైకోర్టు తీర్పులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా 68 సార్లు కోర్టులు తప్పపట్టినా, ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పువస్తే, ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. గవర్నర్ కూడా ప్రభుత్వ నిర్ణయాలపై సంతకం చేసే ముందు పునరాలోచించుకోవాలని కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని... వ్యవస్థకే మచ్చగా తయారయ్యారని, కేంద్ర ప్రభుత్వం ఆమెను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి, మరలా నిర్వహించాలని కోరారు.