Crops Drying in Nellore Due to lack of Kandaleru Lift Irrigation Water: రైతు సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు చేశామని..జగన్ ఢంకా బజాయిస్తారు. అన్నదాతలకు స్వర్ణయుగం నడుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గొప్పలకు పోతారు. కానీ, కాకాణి సొంత నియోజకవర్గంలోనే రైతులు.. పంటలకు నీరందక లబోదిబోమంటున్నారు. నాలుగున్నరేళ్లుగా కండలేరు ఎత్తిపోతల పథకానికి 7 కోట్ల విద్యుత్తు బిల్లులు కట్టే దిక్కు లేదు. కనెక్షన్ కట్ చేసినా పట్టించుకునే పరిస్థితీ లేదని రైతులు వాపోతున్నారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతల పథకం మూలన పడింది. దాని ద్వారా నీరందకపోవడంతో నిమ్మ, పండ్ల తోటలు ఎండుముఖం పడుతున్నాయి. కండలేరు జలాశయ నీటి నిల్వర్థ్యం 68 టీఎంసీలుకాగా.. 30 టీఎంసీలకు పైగా ఉంటేనే.. ఎడమకాలువకు నీటి సరఫరా అవుతుంది. తగ్గితే ఈ కాలువ పరిధిలోని పొదలకూరు, చేజర్ల, వెంకటాచలం తదితర మండలాల్లోని.. 20వేల 704 ఎకరాల భూములకు నీరందదు.
ఇందులో 10 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాలకు పైగా నిమ్మ, మామిడి తోటలున్నాయి. జలాశయంలో నీటిని నమ్ముకుని వరి వేసిన రైతులూ.. చివరి తడులకు నీరందక ఇబ్బందులు పడేవారు. చివరకు పశువుల దాహం కూడా తీర్చలేని పరిస్థితి ఉండేది. 2014లో రైతులు తమ ఇబ్బందులను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యకు పరిష్కారంగా టీడీపీ ప్రభుత్వం 63 కోట్ల వ్యయంతో.. 2015 అక్టోబరు 29న కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసింది. అది 2017లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి జలాశయంలో నీటి నిల్వ తగ్గినా, డెడ్ స్టోరేజికి చేరినా 20 వేలకు పైగా ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా నీరందిస్తున్నారు. కానీ ప్రస్తుతం నీరందక.. పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
Kandaleru Reservoir: నెల్లూరు కనుపూరు కాలువల్లో ఆగిన సాగునీరు..అన్నదాతకు కన్నీరు
"కండలేరు దగ్గర దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి. గతంలో 30 టీఎంసీలు నీరుంటేనే తూములకు అందేది. దీంతో 2016లో లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చారు. అ ధైర్యంతోనే లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పైపులైన్లు ఏర్పాటు చేసుకున్నాము. నిమ్మ తోటలు వేసుకున్నాము." - రైతు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. వరి నార్లు పోసుకునే సమయం ఇది." - రైతు
FLOOD TO KANDALERU: కండలేరు కట్ట.. భద్రత ఎంత..?
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎత్తిపోతల నిర్వహణను గాలికొదిలేసింది. నాలుగున్నరేళ్లుగా విద్యుత్తు బిల్లులూ కట్టలేదు. సుమారు 7 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో.. విద్యుత్తుశాఖ కనెక్షన్ కట్ చేసింది. జలవనరులశాఖ అధికారులు ఎత్తిపోతల పథకాన్ని మూలన పెట్టేశారు. వానల్లేక, ఎండలు మండిపోతుండటంతో ఇక్కడ 10 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని నిమ్మ తోటల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
"40 నుంచి 50 గ్రామాల వరకు రైతులకు సాగునీరందక.. మెట్ట ప్రాంతంలోని నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ఎకరానికి నిమ్మ తోటకు కాపుకు వచ్చే సరికి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చువుతోంది. ఈ జిల్లాకు చెందిన మంత్రి ఉన్నాకూడా.. కరెంటు బిల్లులు కట్టలేదని నీళ్లు వదలలేని పరిస్థితి." - రైతు
కండలేరు జలాశయంలో ప్రస్తుతం 14 టీఎంసీల నీరు ఉంది. ఎత్తిపోతల ద్వారా ఈ నీటిని సరఫరా చేస్తే పంటల్ని రక్షించుకుంటామని రైతులు.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో రైతులంతా కలిసి ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. మంత్రి కాకాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుగంగ మూడో డివిజన్ ఈఈ అనిల్కూమార్ను ఈ విషయమై వివరణ కోరగా.. విద్యుత్తు బిల్లుల పెండింగ్ గురించి ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.