తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మేకపాటి విక్రమ్ రెడ్డి కలిశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు సీఎం జగన్ బీ ఫారం అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
Mekapati Goutham Reddy on Atmakur bypoll: ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు ఉపఎన్నిక వైకాపా అభ్యర్థి విక్రమ్ రెడ్డి అన్నారు. దివంగత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. జూన్ 2న నామినేషన్ వేస్తున్నామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. ఈ ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుపొందుతామని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Schedule Release: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఏకగ్రీవ అవకాశాలు తక్కువే!: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆయన దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు. మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా... గతం నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్నే ఈసారీ పాటించాలని భావిస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.
ఇదీ చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికకు తెదేపా దూరం !