ఆక్వా.. నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత.. ఆ స్థాయి ప్రాధాన్యం ఉన్న సాగు. ఏటా సుమారు 11 వేల హెక్టార్లలో రొయ్యలు, చేపలను పెంచుతుండగా.. రాష్ట్రంలో జిల్లా వాటా ప్రత్యేకంగా చెప్పొచ్ఛు. కృష్ణపట్నం, కాకినాడ, విశాఖ నౌకాశ్రయాల ద్వారా మత్స్య సంపద విదేశాలకూ ఎగుమతి అవుతుండగా- సుమారు ఆరు వేల మందికి పైగానే రైతులు దీనిపై ఆధారపడ్డారు. ఇంత కీలకంగా ఉన్న ఆక్వా రంగంలో కొందరు లీజుదారులుగా అవతారమెత్తి అనధికార సాగు చేపట్టడం.. అడ్డదారిలో భూములను చేజిక్కించుకుని ఇష్టారాజ్యంగా కథ నడిపిస్తుండటంతో సమస్య ఏర్పడింది. ప్రభుత్వ భూములనూ రొయ్యల గుంతలుగా మార్చడంతో పాటు చివరకు పేద రైతులనూ పలు విధాలుగా ఇబ్బంది పెట్టి పంట భూములను లీజుకు తీసుకున్న ఉదంతాలు కోకొల్లలు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఈ పరిస్థితి తారస్థాయికి చేరగా... తట్టుకోలేని స్థానిక రైతులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారించి నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ అధికారులను ఆదేశించింది. అందుకు కొన్ని నిబంధనలు విధిస్తూ ఈ ఏడాది అక్టోబరు 15వతేదీకల్లా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్ నేతృత్వంలో సబ్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మత్స్యశాఖ జేడీ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, సీసీఏ సాంకేతిక సంచాలకులు, ఓ ప్రధాన శాస్త్రవేత్త బృందంగా ఏర్పడి సుమారు 45 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారించారు. 197 పేజీల సమగ్ర నివేదికను ఇటీవలే కలెక్టర్‌కు అందించగా- ఎన్‌జీటీకి సమర్పించారు.
ఆది నుంచి అదే తంతు
మూడు మండలాల పరిధిలో లీజుల్లోనే అసలు కథ ఆరంభమవుతోందన్నది బహిరంగ రహస్యం. తీర ప్రాంతం కావడంతో కొన్నిచోట్ల మట్టిలో లవణశాతం ఎక్కువగా ఉన్నా.. మిగిలిన ప్రాంతాల్లో సాగుకు అనువైన భూములే ఉన్నాయి. ఇక్కడే కొందరు లీజుదారులు తమ చాకచక్యం ప్రదర్శించారు. పేద రైతులకు అధిక మొత్తం ఆశ చూపి పంటపొలాలను చేజిక్కించుకుని.. మత్స్య, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతి తీసుకోకుండానే వాటిని రొయ్యల గుంతలుగా మార్చేశారు. ఆ వ్యర్థ జలాలను పంట కాలువలకు మళ్లిస్తుండగా.. అవి విషతౌల్యమవుతున్నాయి. చెరువుల్లోకి చేరి నీరు సాగుకు పనికి రాకుండా పోతోంది. ఓ దశలో గుంతల దిగువన ఉండే భూముల్లోకి ఆ కలుషిత జలాలు వదిలేస్తుండటంతో పంటలు దెబ్బతింటుండగా- తప్పనిసరి పరిస్థితుల్లో బాధిత రైతులు తమ భూములనూ రొయ్యలసాగుకు అప్పగించేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ తరహా ప్రక్రియ అధికమైంది. క్రమేనా అనధికార ఆక్వా సాగు విస్తరణ అధికమైంది.
లెక్కలే చెబుతాయి
గూడూరు నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఆక్వా మాఫియా ఆగడాలకు విచారణ నివేదిక లెక్కలే అద్దం పడుతున్నాయి. మూడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో అధికారులు లోతైన అధ్యయనం చేశారు. ఇందులో చిట్టమూరు మండలం పిట్టవానిపల్లి, పాదర్తివారికండ్రిగ, రంగనాథపురం, మల్లాం.. వాకాడు మండలం ముట్టెంబాక, తిరుమూరు.. కోట మండలం కర్లపూడి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 887 రొయ్యల గుంతలను పరిశీలించగా.. కేవలం 24కు మాత్రమే అనుమతులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 553 మంది వీటి యజమానులుగా ఉండగా- అందులో 367 మంది లీజుదారులు, 186 మంది సొంతదారులుగా తేల్చారు. 1330.41 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుంతలు విస్తరించి ఉండగా.. ఇందులో 884.36 ఎకరాలు పట్టా, 278.36 ఎకరాలు అసైన్డ్, 78.50 ఎకరాలు సీజేఎఫ్‌ఎస్, 89.19 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధరించారు.
మండలాల వారీగా చూస్తే..
చిట్టమూరు మండలంలో నాలుగు గ్రామాలకు సంబంధించి మొత్తం 329 రొయ్యల గుంతలు ఉండగా- 441.67 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇక్కడ 56.02 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవగా- 196.59 డీకేటీ, 189.06 ఎకరాలు పట్టా భూమిగా ఉన్నాయి. పిట్టవానిపల్లిలో 148 గుంతలకు 98 మంది యజమానులు ఉండగా.. వీరిలో 24 మంది రైతులు, 74 మంది లీజుదారులు. పాదర్తి వారి కండ్రిగలో 43 గుంతలకు 28 మంది ఉండగా.. వీరిలో 2 రైతులు, 26 మంది లీజుదారులు. ఇక, రంగనాథపురంలో 98 గుంతలకు 40 మంది ఉండగా.. 14 మంది సొంత రైతులు, 26 మంది లీజుదారులు. మల్లాంలో 40 గుంతలకు 20 మంది యజమానులు ఉండగా.. వీరిలో 5 మంది సొంత రైతులు, 15 మంది లీజుదారులు.
కోట మండలంలో ఒక్క గ్రామానికి సంబంధించి 142 గుంతలు 231.47 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 140.22 ఎకరాలు పట్టాభూమి కాగా.. 81.77 అసైన్‌మెంట్ భూమి. 9.48 ఎకరాల ప్రభుత్వభూమి ఆక్రమణకు గురైంది. మొత్తం 58 మంది రైతులు ఇక్కడ సాగు చేస్తుండగా.. ఆరుగురికే అనుమతులు ఉన్నాయి.
వాకాడు మండలంలో రెండు గ్రామాలకు సంబంధించి మొత్తం 416 రొయ్యల గుంతలు ఉండగా- 657.09 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో 555.08 ఎకరాలు పట్టా భూమి. 78.50 సీజేఎఫ్‌ఎస్, 23.51 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. గ్రామాల వారీగా చూస్తే... ముట్టెంబాకలో 158 గుంతలు.. 232.19 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో 168.11 ఎకరాలు పట్టాభూమి, 56.50 సీజేఎఫ్‌ఎస్, 7.58 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఇక్కడ మొత్తం 96 మంది రైతులు ఉండగా.. ఎవరికీ అనుమతులు లేవు. ఇందులో లీజుదారులు 42 మంది కాగా.. సొంత రైతులు 54 మంది. తిరుమూరులో 258 గుంతలు ఉండగా.. 424.09 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో పట్టాభూమి 386.97 ఎకరాలు, సీజేఎఫ్‌ఎస్ 22 , ప్రభుత్వ భూమి ఆక్రమణ 17.93 ఎకరాలుగా ఉంది. ఇక్కడ మొత్తం 213 మంది రైతులకు ఎవరికీ అనుమతులు లేవు. ఇందులో లీజుదారులు 174 మంది కాగా.. సొంత రైతులు 39 మంది ఉన్నారు.
తాలుపోయిన వరి వెన్ను
కర్లపూడి సమీపంలో చల్లకాలువ ఆక్రమించి రొయ్యల సాగు