Anam Ram Narayana Reddy : నెల్లూరు జిల్లాలో దశబ్దాల రాజకీయ వారసత్వం కలిగిన మరో కీలక కుటుంబం సైతం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లాలోనే అత్యంత సీనియర్ నేత.. వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సైతం పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన ఫోన్‌ను సైతం ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఆరోపించిన ఆయన.. ఏకంగా తనను భౌతికంగా అంతమొందించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేనైన తనకు ప్రభుత్వం భద్రత కుదించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేనైన తనకు ప్రభుత్వం భద్రత కుదించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో నెల్లూరు వస్తుంటే కొందరు నీడలా తనని వెంటాడారని ఆయన తెలిపారు. నక్సల్స్, ఎర్రచందనం స్మగ్లర్ల ప్రభావం ఉన్న ప్రాంతానికి ఎమ్మెల్యేనైన తనకు భద్రత కుదించడంలో అర్థమేంటని ఆయన ప్రశ్నించారు. ఉన్న ఇద్దరు గన్‌మెన్లను తీసివేయండని ప్రభుత్వానికి చెప్పినట్లు ఆనం వివరించారు.
"నా ఫోన్, నా పీఏ పోన్ ఒకటిన్నర సంవత్సరం నుంచి ట్యాపింగ్లో ఉన్నాయి. నేను నా కూతురు, బంధువులతో మాట్లాడాలన్న ఫేస్ టైం వీడియో కాల్లో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చి.. చేసేవాళ్లే మా వాళ్లైతే నేను ఎవరికో ఎందుకు చెప్పుకోవాలి. ఎర్రచందనన్ని, నక్సల్ విధానాన్ని వ్యతిరేకించే వాడిని నేను. ఆ ప్రాంతానికి వెళ్లే ప్రజాప్రతినిధినైనా నాకు సెక్యూరిటీ అవసరం లేదని తీసేశారు." -ఆనం రాంనారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
ఏదైనా ప్రభుత్వం రెండుసార్లు అధికారం చేపడితే.. వ్యతిరేకత రావడం సహజమేనని కానీ.. ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లకే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడం విచారకరమని ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు తెలుగుదేశం, వైసీపీ పాలనను బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగేతర శక్తులు అధికారులను తీసివేస్తామని.. ఎమ్మెల్యేల భద్రత తొలగించేస్తామని బెదిరిస్తుంటే ఏ రకమైన పాలనాదక్షితను ప్రదర్శించగలని ఆనం ప్రశ్నించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడలేదన్నారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన ఆనం రాంనారాయణరెడ్డి.. పార్టీని వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆనంరాంనారాయణరెడ్డి భద్రతను కుదించడమే గాక.. నియోజకవర్గానికి మరొకరిని ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించింది.
ఇవీ చదవండి :