సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని సన్నిహితులు తెలిపారు.
‘కత్తి మహేశ్‌కి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పూర్తి ఆరోగ్యవంతుడిగా మారేందుకు రెండు మూడు వారాల సమయం పట్టొచ్చు’ అని చెప్పారు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మహేశ్ కంటిచూపు కోల్పోయారంటూ వార్తలు వెలువడ్డాయి. అవి అవాస్తమని, మహేశ్ చూపు కోల్పోయే అవకాశం లేదని వైద్యులు వివరించినట్లు తెలియజేశారు.
ఈ నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు మహేశ్. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను నెల్లూరు ఆసుపత్రి నుంచి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి..
Katti Mahesh: కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం..చెన్నైకు తరలింపు