ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనతో లేడు.. కుటుంబం సభ్యులు రావొద్దన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని మహిళ ఓ చెట్టుకిందనే ఉంటోంది. నెల్లూరు నగరానికి చెందిన తిరుపతమ్మ(18) ఏడాది కిందట బంధువులను ఎదిరించి... ఆనంద్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. భర్త ఆనంద్ దొంగతనం చేసి జైలు పాలయ్యాడు. దీంతో తిరుపతమ్మ దిక్కలేనిదయ్యింది. ఇళ్లు వాకిలి లేక నగరంలోని చాణక్యపురిలోని దర్గా వద్ద బాబుతో ఉంటోంది. తినడానికి తిండిలేక...నానా అవస్థలు పడుతోంది. దారినపోయే వారు ఇచ్చే డబ్బులతో ఆకలి తీర్చుకుంటోంది. భర్త దొంగతనాలు చేస్తుండటంతో ..పెంచిన మేనత్త కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు.
బిడ్డను కుక్కలు లాక్కుపోతాయనే భయంతో...
ఇళ్లు లేకపోవడంతో తిరుపతమ్మ దర్గా ఆవరణలోనే నిద్రపోతోంది. ఏడాది బిడ్డను కుక్కలు లాక్కుపోతాయేమోనని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. దర్గా తలుపుకు బాబును తాడుతో కట్టేసి పనులు చేసుకుంటోంది. తిరుపతమ్మ దుస్థితిని చూసి చలించిన రూట్స్ చారిటబుల్ సంస్థ నిర్వహకుడు తినుబండారాలు అందజేస్తున్నారు. కొంత సామాగ్రి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. దాతలు ఆదుకుని ఉండటానికి కాస్తంత నీడనిస్తే ఏదైనా పని చేసుకుని బతుకుతానని తిరుపతమ్మ అంటోంది.
ఇదీచూడండి. జీజీహెచ్లో నర్సుల ధర్నా