నెల్లూరు జిల్లా దుత్తలూరు ఆదర్శ పాఠశాల సమీపంలో 17వ తేదీ రాత్రి రెండు లారీలు ఢీకొన్న ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చినా స్పందన లేదు. చివరికి పోలీసులు వారిని ఇతర వాహనాల్లో ఉదయగిరికి తరలించారు. ఈ నెల 21న దుత్తలూరు సమీపంలోనూ ఇలాంటి సంఘటనే జరిగినా అదే తీరు.
సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉదయగిరికి ఈ నెల 16న ఓ మహిళను దుత్తలూరు 108 వాహనంలో తరలిస్తుండగా బసినేపల్లి వద్ద వాహనం టైరు పగిలిపోయింది. స్పేర్ టైర్ అందుబాటులో లేక ఆమెను ఆటోలో తరలించారు.
ఉదయగిరి పట్టణంలో ఈ నెల 21న రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యానికి ఆత్మకూరుకు తరలించేందుకు వైద్యుడు 108 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేశారు. వారు సీతారామపురం వాహనాన్ని సంప్రదించి డాక్టరుతో మాట్లాడారు. వాహనానికి టైరు సరిగా లేదని, ఒకవేళ వచ్చినా ఆత్మకూరు వరకు వెళుతుందో, లేదోనని సిబ్బంది తెలిపారు. చివరకు ప్రైవేటు వాహనంలో ఆమెను ఆత్మకూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.
సమాచారమిచ్చినా.. రాని వాహనాలు
నెల్లూరు జిల్లాలో 108 వాహనాలు 33 ఉండగా ఐదు వాహనాలు మూలనపడ్డాయి. అందులో కొన్నింటిని కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను తరలించేందుకు కేటాయించారు. అందుబాటులో ఉండే వాహనాలకు టైర్లు అరిగిపోయి ఉండటం, నిర్వహణ సరిగా లేక మరమ్మతులకు గురయ్యాయి. వాటి సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచలేక సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు.
108 వాహనాలను నిర్వహణను చూస్తున్న సంస్థ గడువు ముగుస్తుండటంతో నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే నెల నుంచి కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయన్న నెపంతో ప్రస్తుతం సేవలందిస్తున్న వాహనాల గురించి పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆపదలో ఉన్నామని సమాచారమిచ్చి గంటల తరబడి వేచి చూసినా స్పందన లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు.
నూతన వాహనాలు అందుబాటులోకి..
వచ్చే నెల 1 నుంచి నూతన 108 వాహనాలు జిల్లాలో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి మండలానికి ఒక నూతన వాహనం కేటాయించారు. రాష్ట్ర సీఎం మంగళవారం ఈ విషయంపై కూడా చర్చించారు. నూతన వాహనాలు వస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.- రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో
ఇదీ చదవండి: చైనాకు సవాల్: భారత్‌కు అమెరికా బలగాలు!