Road Accident In Nellore: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. ఒక్కో రూపాయి కూడబెట్టుకుని మరీ కూరగాయలను అమ్ముకుంటూ ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి జీవితాన్ని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ దంపతుల మృతితో వీరి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గల జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి: నెల్లూరు జిల్లా సంగం మండలం అనసూయనగర్ గ్రామానికి చెందిన వెంకట శేషయ్య, వెంకట వరలక్ష్మి ఇరువురూ భార్యాభర్తలు. వీరు రోజూ మాదిరిగానే ఆటోలో కూరగాయలు వేసుకుని అమ్మేందుకు వెళ్తుండగా అటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వెంకట శేషయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య వరలక్ష్మి సైతం తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిత్యం గ్రామంలో పండే కూరగాయలను ఆటోలో వేసుకుని గ్రామగ్రామాన తిరిగి అమ్ముతుంటారు. అయితే రోజులానే కూరగాయలను అమ్ముకునేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి పిల్లలు శివ, బాలాజీ, ప్రవళిక ఈ ఘటనతో అనాథలయ్యారు. సాయంత్రానికల్లా తిరిగొస్తారనుకున్న అమ్మానాన్నలు ఇలా అనంతలోకాలకు తరలివెళ్లిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మా నాన్నా అంటూ పిల్లలు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించాయి.
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం - ముగ్గురు మృతి
అన్నకి బాయ్ చెప్పడానికి వచ్చి అనంత లోకాలకు - స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి