పాఠశాలల విలీనం వల్ల ఎదురవుతున్న పరిస్థితిని తెలుసుకునేందుకు పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన 'బడి కోసం బస్సు యాత్ర' కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇవాళ ప్రారంభమైన బస్సు యాత్ర పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రను అడ్డుకోవటంపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి చర్చించారు. రాత్రి సమయంలో యాత్రకు అనుమతి ఇవ్వలేమని ఎస్పీ స్పష్టం చేశారు.
విలీనం వద్దు: మరోవైపు పాఠశాలల విలీనాన్ని ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలతో హోరెత్తించాయి. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించే నిర్ణయాలు మానుకోవాలంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసన వ్యక్తం చేసింది. పాఠశాలల విలీనం నిలుపుదల చేయాలంటూ విజయనగరంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహించాయి. తరగతుల విలీనం, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలంటూ నంద్యాల కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. విద్యారంగంలో ఉన్నసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించింది. విలీన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఏఐఎస్ఎఫ్ విజయవాడ లెనిన్ కూడలి, దర్నా చౌక్‌లో నిరసన చేపట్టింది.ఉపాధ్యాయులకు చేటు కలిగించే 117 జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ విశాఖలో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య చేపట్టిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి.
ఇవీ చూడండి