Pregnant women are facing problems in agency: మన్యం జిల్లాలోని ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు లేక.. ఎనినిది, తొమ్మిది నెలల గర్భిణులు వైద్యపరమైన సదుపాయాలు పొందాలంటే.. నరకయాతన పడుతున్నారు. ఇటువంటి వారి కోసం గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం అప్పటి పీఓ లక్ష్మీశ వినూత్నంగా వసతి గృహానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 2018 సెప్టెంబరు 17న సాలూరులోని వైటీసీలో ఏర్పాటు చేశారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని గిరిశిఖర సుదూర ప్రాంత గిరిజన గర్భిణులకు వసతి, సేవలు అందించేందుకు మొదటి విడతగా సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారు. రెండో విడతగా గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేశారు. వీటి సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచి.. అవార్డు కూడా సొంత చేసుకుంది. ప్రస్తుతం వీటి సేవలు తీసికట్టుగా మారాయి.
లక్ష్యానికి దూరంగా గర్భిణుల గృహాలు.. గర్భం దాల్చి ఏడు నెలలు నిండిన వారిని వసతి గృహంలో చేర్చేందుకు వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు అప్పట్లో గిరిశిఖర గ్రామాలకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి.. వసతిగృహంలో చేర్పించేవారు. ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రతిరోజూ మందులు, మెను ప్రకారం పౌష్టికాహారం అందించి.. తల్లీబిడ్డలను రక్షించేలా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం గర్భిణుల గృహాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. సిబ్బంది కొరత ఏర్పడింది. మెను ప్రకారం పోషకాహారమూ లేదు. ప్రత్యేక వైద్యుడు లేరు. అంబులెన్స్ నిర్వహణకు కూడా నిధులు ఇవ్వకపోవడంతో అందులో కొన్ని సదుపాయాలు కరవయ్యాయి.
అందుబాటులో లేని యంత్ర పరికరాలు.. వసతి గృహాల్లోని గర్భిణులకు రోజూ బీపీ, మధుమేహం పరీక్షలు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవు. గుమ్మలక్ష్మీపురంలో తూనిక యంత్రం పాడై నెలలు కావస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. సాలూరు వసతి గృహంలో మరుగుదొడ్లు పాడై ఆరునెలలైనా స్పందన లేదు.
మాకు జీతాలు కూడా సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. ఇక్కడ గర్భిణిల పరిస్థితిని బట్టి పార్వతీపురం తీసుకెళ్లాల్సి ఉంటుంది. మా దగ్గర ఉన్న వాహనానికి సాకర్యాలు సరిగా లేక పోవడం వల్ల 108 ద్వారా పంపించడం జరుగుతుంది.. ఆ సమయంలో మేము తిరిగి రావడానికి చార్జీలకు డబ్బులు లేని పరిస్థితి కూడా మాకు జరిగాయి.- శారద, స్టాఫ్ నర్సు గుమ్మలక్ష్మీపురం గర్భిణుల వసతి గృహం
ఇక్కడ ఉన్న గర్భిణులకు మెరుగైన వైద్యం కాని వసతులు కాని లేక పోవడం చాలా బాధాకరం.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారరంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వసతి గృహాల్లో ప్రతీ దానికి లోటు అనేది లేకుండా ఉండేది. వీటన్నికి సంబంధించి మేము ఒకటే తెలియజేస్తున్నాం.. ఈ వసతి గృహాల్లో ఉన్న గర్భిణులకు మాత్రం మెరుగైన సదుపాయాలు, సక్రమైన ఆహారం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నామము.- జగదీశ్వరి, టీడీపీ మహిళా నాయకురాలు