Filariasis patients problems: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో.. వందలాది మంది నిత్యం పడే బోద కాలు వ్యాధిగ్రస్థుల బాధలు అంతా ఇంతా కాదు. పెదపెంకి గ్రామ జనాభా సుమారు 10వేలు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మరికొందరు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ గ్రామాన్ని 40ఏళ్లుగా బోద కాలు వ్యాధి పీడిస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3,990 మంది బాధితులున్నారు. అధికారులు గుర్తించిన లెక్కల ప్రకారం 2018 వరకు పెదపెంకి గ్రామంలోని బాధితుల సంఖ్య 195.
రెండు కాళ్లకూ ఉంటేనే పింఛను.. మందుల రకాల్ని బట్టి నెలకు ఒక్కొక్కరికి రూ.4వేల నుంచి రూ.5వేలవుతోంది. వీరికి నెలకు రూ.5వేల చొప్పున పింఛను ఇచ్చే సదుపాయం ఉండగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు కాళ్లకూ వ్యాధి ఉండాలని అంటున్నారు అధికారులు. బాధితుల్లో చాలా మందికి ఒక కాలికే విపరీతమైన వాపు ఉంది. ఈ కారణంగా 90శాతం మంది పింఛనుకు నోచుకోవడం లేదు. ఏడాది కిందటి వరకు 75 మందికి పైలేరియా పింఛను రూ.5వేల చొప్పున ఇచ్చేవారు. వీరిలో అర్హతలు లేవనే కారణంతో 72 మంది పింఛన్లను తొలగించారు. చేసేది లేక వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు సామాజిక పింఛనుతో నెట్టుకొస్తున్నారు.
కాళ్లవాపుతో నరకం.. ఈ వృద్ధురాలి పేరు మడి అప్పమ్మ. రెండు కాళ్లకూ బోద సోకింది. మంచంపై నుంచి కదల్లేరు. పక్కనే గ్యాస్‌పొయ్యి పెట్టుకుని వంట చేసుకుంటున్నారు.
వండుకోలేని రోజుల్లో చుట్టుపక్కల వారు ఆహారం పెడుతుంటారు. ఇద్దరు కుమారులు ఉపాధి కోసం వేరేచోట్ల ఉన్నారు. సామాజిక పింఛను రూ.3వేలు వస్తోంది. ఇందులో రూ.2వేలు మందులకే అవుతోంది. కాళ్లవాపుతో నరకం అనుభవిస్తున్నారు.
ఇంట్లోనే జీవనం.. అనధికార లెక్కల ప్రకారం.. గ్రామంలో 500 నుంచి 600 మంది బాధితులుంటారని అంచనా. సాధారణంగా బోద అంటే కాలుకే అనుకుంటారు. కానీ ఇక్కడ కాళ్లు, చేతులతోపాటు ఛాతీ, పురుషాంగంపైనా ఉంటోంది. కొందరు రహస్యంగా మందులు వాడుతుండగా మరికొందరు లోలోన మదన పడుతున్నారు. కొందరైతే గడప దాటకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు.
అధ్యయనమే లేదా?.. దశాబ్దాలుగా వ్యాధి పట్టి పీడిస్తున్నా కారణాలపై అధికారులు అధ్యయనం చేయలేదు. పారిశుద్ధ్య లోపాన్ని కారణంగా చూపుతున్నారు. రెండేళ్ల కిందట గ్రామంలో పైలేరియా నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3 నెలలకే మూసేశారు. ఇప్పుడు పరీక్ష చేయించుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని విజయనగరం వెళ్లాల్సిందే.
20 ఏళ్లుగా నరకం.. గతంలో కూలి పనులకు వెళ్లేవాడిని. ఇప్పుడు నడవలేను. ఏ పనీ చేయలేను.
20 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నా. జ్వరం వస్తే తల తిప్పుతుంది. వారంపాటు మంచంపైనే ఉంటా. మందులకే నెలకు రూ.6వేలు అవుతుంది. పైలేరియా పింఛను రూ.5వేలు ఇస్తే కొంతైనా ఉపశమనం కలుగుతుంది. -ఎల్.నారాయణరావు, పెదపెంకి, బలిజిపేట
మెరుగైన వైద్యం అందేలా చర్యలు.. గ్రామంలో కేసులు ఎక్కువగా ఉన్న విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు కాళ్లకూ వ్యాధి సోకితేనే పింఛను ఇస్తారు. బాధితులకు పరీక్షలతోపాటు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం.
- బి.జగన్నాథరావు, డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా
ప్రారంభంలో గుర్తించడం కష్టం.. క్యూలెక్స్ దోమ కుట్టాక మైక్రో పైలేరియా క్రిములు శరీరంలోకి ప్రవేశించి శోషరస (లింప్) నాళాల్లో స్థిరపడతాయి. అవి ఒకటి నుంచి రెండేళ్లలో పెరిగి పెద్దవుతాయి. బోదకు కారణమవుతాయి. తరచూ పరీక్షలు చేయించుకుంటే తొలినాళ్లలోనే సమస్యను గుర్తించవచ్చు. మందులు వాడుతూ.. చిన్నచిన్న వ్యాయామాలు చేస్తే వాపును కొద్దిగా నియంత్రించవచ్చు. ఎక్కువసేపు కూర్చోకుండా అటుఇటు తిరగడం, పడుకున్నప్పుడు దిండుపై కాలు పెట్టుకుంటే రక్త ప్రసరణ బాగుంటుంది. - ఎం.తులసి, జిల్లా మలేరియా నివారణ అధికారి, విజయనగరం
ఇవీ చూడండి: