Ammavodi Scheme Restrictions: పిల్లలను బడులకు పంపితే.. చదివించే బాధ్యత తనదంటూ సీఎం జగన్ పదేపదే చెప్పే గొప్పలు తక్కువేం కాదు. కానీ అమ్మఒడి డబ్బులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను ఏటికేడు తగ్గిస్తున్నారు. తల్లులకు అందించే ఆర్థికసాయంలో కోత పెడుతున్నారు. గతేడాది కన్నా ఈసారి ఏకంగా 1.34 లక్షల మందికి 'అమ్మఒడి' పథకాన్ని దూరం చేశారు. దీంతో ఒక్క ఏడాదిలోనే సర్కారుకు 201 కోట్ల రూపాయలు మిగిలాయి.
Nadu-Nedu Works Speed Up: పార్వతీపురం జిల్లాలో రాత్రికి రాత్రే నాడు-నేడు పనులు..
2019-20 సంవత్సరంలో 'అమ్మఒడి' పథకం ప్రారంభించారు. మిగిలిన సంక్షేమ పథకాల నిబంధనలనే దీనికి వర్తింపజేశారు. 2020-21లోనూ ఇదే విధానం పాటించారు. అయితే 2021-22లో 75శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఆరుదశల వడపోతతో 52వేల 463మందికి కోతపెట్టారు. 2022-23లో 75శాతం హాజరుతోపాటు సగటున విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లకు మించిందంటూ భారీగా కోత విధించారు. 2021-22లో 75శాతం హాజరు పేరుతో ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో అమ్మఒడి డబ్బులు వేశారు. 2022-23కు ఇప్పుడు జూన్‌లో వేస్తున్నారు. 2024 జూన్ నాటికి కొత్త ప్రభుత్వం వస్తుంది. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని జూన్‌కు మార్చడం వల్ల ఏడాది చెల్లింపులు 600 కోట్ల రూపాయలు మిగిలినట్లయింది.
Jagan Tour in Kurupam: నేడు కురుపాంలో జగన్ పర్యటన.. రాత్రికి రాత్రే పనులు.. చెట్ల నరికివేత
పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే కాగా.. లబ్ధిదారుల నుంచి 2వేల చొప్పున వసూలు చేస్తోంది. తల్లులకు 15వేలు ఇస్తామన్న సీఎం జగన్.. మొదటి ఏడాది నుంచే కోతలు ప్రారంభించారు. 2019-20లో 15వేలు చొప్పున జమ చేసి, తర్వాత మరుగుదొడ్ల నిర్వహణకు వెయ్యి ఇవ్వాలన్నారు. చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులు వసూలుచేసి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమచేశారు. కొంతమంది తల్లిదండ్రులు నిరాకరించడంతో.. 2020-21లో వెయ్యి మినహాయించుకొని, 14 వేలే జమచేశారు. 2021-22కు వచ్చేసరికి కోత 2వేలకు చేరింది. ఈ ఏడాదీ రూ.13వేలే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2021లో లబ్ధిదారులకు 6వేల 673కోట్ల రూపాయలు అందించగా.. 2022లో ఇది 6వేల 595కోట్లకు తగ్గింది. ఈ ఏడాది మరింత తగ్గిపోనుంది.
కాగా.. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నాలుగో విడత అమ్మఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. విశాఖకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా కురుపాం మండలం చినమేరంగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో కురుపాం సభాస్థలం చేరుకుని అమ్మఒడి నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.