YSRCP Leaders meet against MLA Brahmanaidu : పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అదే పార్టీలోని నాయకులు తిరుగు బావుటా ఎగరేశారు. జగనన్న కోసమని బొల్లా బ్రహ్మనాయుడు కోసం పని చేసి ఆర్థికంగా నష్టపోయామని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నూజెండ్ల మండలం జంగాలపల్లిలో అసమ్మతి నేతలంతా సమావేశమయ్యారు. జగనన్న కోసం పనిచేసే నష్టపోయిన బాధితుల పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తవారిని తెచ్చుకుందాం, బొల్లా వద్దంటూ నేతలు వ్యాఖ్యానించారు. జగనన్న కోసం కష్టపడి పని చేశామని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమను దూరంగా పెట్టాడని వాపోయారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు.
ఇక అధినేత వద్దకు ఎమ్మెల్యే పనితీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. బొల్లాను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమని వివరించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బాధితులంతా మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింత ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, భూక్యా రాంజీ నాయక్, దావులూరి వీరాంజి, కోట నాయక్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నాయకులే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అసమ్మతి రాగం వినిపించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఆస్తులను సైతం అమ్ముకొని పార్టీ కోసం పని చేశాం. నేడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన ఒంటెద్దు పోకడతో పార్టీని నమ్ముకుని పని చేసిన వారిని చీదరించుకుంటూ, అవమానపరుస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు బనాయిస్తూ మరింత మనోవేదనకు గురి చేస్తున్నాడు. జగనన్న నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తాం.. స్థానికంగా నూతన నాయకుని ఏర్పాటుకై జగనన్న దృష్టికి తీసుకు వెళ్తాం.. మున్ముందు కూడా వైఎస్సార్సీపీ విధేయులుగా ఉంటాం. - దావులూరి వీరాంజనేయులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన నాటి నుంచి పార్టీని నమ్ముకుని, ఆస్తులను సైతం ఫణంగా పెట్టి, పార్టీ కోసం కృషి చేశాం. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవలంబిస్తున్న విధివిధానాలతో వినుకొండ ప్రాంతంలో పార్టీకి తీరని నష్టం ఏర్పడుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి 30 లక్షలు 40 లక్షలు వెచ్చించి పదవులు పొందామని చెప్పుకునే వారికి పదవులను కట్టబెట్టి పార్టీ పరువు ప్రతిష్టలను రోడ్డుకెక్కించారు. ఇదేమిటని ప్రశ్నించి, వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, మరింత మనోవేదనకు గురి చేస్తున్నాడు. రానున్న రోజుల్లో అసమ్మతి వర్గాన్ని చేరదీసి, మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. జగనన్న నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. స్థానికంగా నూతన నాయకుని ఏర్పాటుకై జగనన్న దృష్టికి తీసుకు వెళ్తాం. - చింతా ఆదిరెడ్డి
ప్రజా రాజ్యం పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడును గెలిపించుకునేందుకు, ఆస్తులను సైతం ఫణంగా పెట్టి గెలిపించుకున్నాం. నేడు పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా డబ్బులు ముట్ట చెప్పే వారికి, తాను చేసే పనులకు అడ్డు చెప్పకుండా ఉండే వారికి బాధ్యతాయుతమైన పదవులను, ఉద్యోగాలను అమ్ముకుంటున్నాడు. ఇదేమిటని అడిగితే నీవు టీడీపీకి వత్తాసుగా పని చేస్తున్నామని ఎదురు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చక్రాయపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరేందుకు నేను చేసిన కృషిని నాడు అభినందించి, నేడు అభియోగాలు మోపుతూ మనస్తాపానికి గురి చేస్తున్నాడు. అంతేకాకుండా పల్నాడు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సన్నిహితంగా మెలుగుతున్నానని కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తున్నాడు. జగనన్న నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. స్థానికంగా నూతన నాయకుని నియామకానికి జగనన్న దృష్టికి తీసుకు వెళ్తాం. - మూడావత్ కోటానాయక్
పార్టీ కోసం ఉద్యోగం కూడా వదులుకొని, ఆస్తులను ఫణంగా పెట్టి పనిచేస్తే ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు మమ్మల్ని పక్కనపెట్టి మానసికంగా కృంగదీశాడు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను పక్కనపెట్టి, తనకు నచ్చిన అభ్యర్థిని ప్రకటించాడు. సర్పంచి ఎన్నికల్లో ఓటమిని చవిచూసి, పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదేమిటి అని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మేము అడిగితే... తప్పుడు కేసులు బనాయిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నాడు. జగనన్న నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. - భూక్యా రాంజీ నాయక్