YCP Is Anarchy Inpalnadu: మాచర్లలో అధికార వైసీపీ అరాచకం సృష్టించింది. అధికారం అండతో తెలుగుదేశం నేతలు, కార్యాలయం, వాహనాలపై విధ్వంసానికి తెగబడింది. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. మాచర్లలో నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాన్వెంట్ స్కూల్ వరకూ.. ర్యాలీ చేపట్టారు. పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిషోర్ నివాసం ఉండే ప్రాంతం కావటంతో అక్కడ టీడీపీకు వచ్చిన స్పందనను.. అధికారపక్ష నేతలు సహించలేకపోయారు.
ప్రధాన రహదారి నుంచి వడ్డెర కాలనీ వైపు ర్యాలీ వెళ్తుండగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు..తమకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయని.. ఇటువైపు రావొద్దని ర్యాలీని అడ్డుకున్నారు. ఉదయం నుంచే ఆప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇక్కడకు ఎవరొస్తారో చూస్తామంటూ కవ్వింపు చర్యలకు దిగినా.. పోలీసులు వాటిని పట్టించుకోలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయగా.. వారు ప్రతిఘటించారు. టీడీపీ వారు సైతం రాళ్లు, కర్రలు ఏదీ దొరికితే అది పట్టుకుని వైసీపీ కార్యకర్తల వెంటపడటంతో..వారు పరారయ్యారు.
ఘర్షణ పెద్దదైన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బ్రహ్మారెడ్డికి.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓవైపు టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు మాత్రం దాడికి తెగబడుతూనే ఉన్నాయి. బ్రహ్మారెడ్డిని కొట్టే ప్రయత్నం చేశాయి. ఈ సమయంలో తోపులాటలో బ్రహ్మారెడ్డికి గాయలయ్యాయి. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడికి దిగారు. బ్రహ్మారెడ్డిని కార్యక్రమం ఆపేసి గుంటూరు వెళ్లాలని పోలీసులు ప్రతిపాదించగా.. ఆయన ససేమిరా అన్నారు. చివరకు పోలీసులు ఆయనను బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు పంపించారు.
పోలీసులు బ్రహ్మారెడ్డిని గుంటూరుకు పంపగానే వైసీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. అప్పటికప్పుడు మాచర్లతో పాటు చుట్టుపక్కల నుంచి నాయకులు, కార్యకర్తలను పట్టణానికి రప్పించారు. ఇళ్లకు వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. వైసీపీ కార్యకర్తలు వెంటపడి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దొరికివారిని దొరికినట్లు బాదారు. పెద్ద పెద్ద రాళ్లు, భవన నిర్మాణంలో ఉపయోగించే దుడ్డుకర్రలు పట్టుకుని కొట్టడంతో.. పలువురికి తీవ్రగాయాలై.. రక్తం కారింది. టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. కార్లకు నిప్పుపెట్టారు.
సొసైటీ కాలనీలో ఉన్న టీడీపీ కార్యాలయానికి చేరుకుని దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఇంత జరుగుతున్నా సకాలంలో అగ్నిమాపక శకటాలు చేరుకోలేదు. అవి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే సమయానికి బూడిదే మిగిలింది. మంటలు పక్కఇళ్లకు వ్యాపించకుండా ఆప్రాంతంలో విద్యుత్తు సరఫరా ఆపేశారు. మూడు గంటలకుపైగా మాచర్ల పట్టణంలో దాడులు కొనసాగాయి. వైసీపీ కార్యకరలు వీరంగం సృష్టించడంతో భయానక వాతావరణం నెలకొంది. అర్థరాత్రికి పరిస్థితులు చక్కబడ్డాయి. అనంతరం మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో జరిగిన విధ్వంసకాండతో సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఇవీ చదవండి: