Tigers In Palnadu District : పల్నాడు జిల్లా సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం ప్రజల్లో గత కొన్ని రోజులుగా అలజడి సృష్టిస్తోంది. దీనిపై జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు తెలిపిన సమాచారం ప్రకారం జిల్లాలో పులులు ఉన్నట్టు.. జాడ గుర్తించినట్టు తెలిపారు. వెల్దుర్తి మండలం లోయాపల్లి ఫారెస్ట్‌లో పులుల పాదముద్రలను బట్టి పులులు ఉన్నట్టు నిర్ధారించారు. అయితే పులులు జనావాసాలకు దూరంగానే ఉన్నాయని ఎవరూ ఆందోళన పడొద్దని సూచించారు.
పులుల జాడ గుర్తించిన అటవీ శాఖ అధికారులు: శ్రీశైలం-నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ శాఖ అధికారులు పులుల జాడ గుర్తించారు. పులుల పాదముద్రలను బట్టి ఆడ పులి, రెండు పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించామని పల్నాడు జిల్లా డీఎఫ్‌వో రామచంద్రరావు తెలిపారు. వెల్దుర్తి మండలం లోయాపల్లి ఫారెస్ట్‌లో వీటిని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం పులులు జనావాసాలకు దూరంగా సంచరిస్తున్నాయని...ఆందోళన అవసరం లేదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ సమీప ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కెమెరా ట్రాప్స్‌లో మాకు మూడు పులులు కనబడటం జరిగింది. ఆ మూడు పులులు కూడా నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లోకి వెళ్తాయని ఆశిస్తున్నాం. నాగార్జున సాగర్ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున అక్కడికి వెళ్తాయని ఆశిస్తున్నాం. ప్రజలు ఎవరు కూడా పులులు గ్రామాల్లోకి వస్తాయని భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదు. - రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి
ఫారెస్ట్‌లో 75 పులులు : గత కొన్ని రోజులు నుంచి వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లోని శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పులి గురించే చర్చిస్తున్నారు. ఏ సమయంలో ఎటునుంచి పులి వచ్చి దాడి చేస్తుందేమోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పల్నాడు జిల్లా విజయపురిసౌత్ ప్రాంతంలో తరచూ పులుల సంచారం ఉంటోంది. ఇటీవలి కాలంలో మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి పంజా విసిరడంతో ఆ ప్రాంత వాసుల్లో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఒక తల్లి, రెండు కూనలు మార్కాపురం అటవీ పరిధిలోని అక్కపాలెంలో అటవీ శాఖ అధికారులకు కనిపించాయి.
ఇవీ చదవండి