World Telugu Writers Conference On 2nd Day : విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాషా పరిరక్షణ ఆవశ్యకతను ఘనంగా చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలు తెలుగు భాషకు పూర్వవైభవం రావాలంటూ తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. మహాసభల్లో భాగంగా తొలుత పరిశోధనరంగ ప్రతినిధులు, తర్వాత భాషోద్యమ ప్రతినిధులు హాజరై తమ మనోభిష్టాన్ని వెల్లడించారు. ప్రస్తుతం భాషా పరిశోధన స్థాయి దిగజారిందని, డబ్బులతో డాక్టరేట్లు కొనే స్థాయి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాడని భాష వాడిపోతుందని, వాడిన భాష వికసిస్తుందని భాషోద్యమ ప్రతినిధులు పేర్కొన్నారు.
విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో రెండోరోజూ సాహితీ ప్రేమికులు సందడి చేశారు. వివిధ రచనా వ్యాసాంగాలతో సభలను రక్తి కట్టించారు. కొందరు కవితలు వినిపిస్తే, మరికొందరు సాహీతీ ఉపన్యాసాలు చేశారు. పరిశోధనరంగ ప్రతినిధుల సదస్సుకు విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు సవరం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రధానంగా పరిశోధనరంగంపై జరిగిన సదస్సు వాడివేడిగా సాగింది. డబ్బులుంటే డాక్టరేట్లు వచ్చే పరిస్థితులు వచ్చాయని, భాషా పరిశోధన స్థాయి దిగజారిందని వక్తలు అభిప్రాయపడ్డారు.
'భాషను బతికించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది - తెలుగు భాష మన అస్తిత్వం'
పదో తరగతి తప్పినవాడు సైతం డాక్టరేట్ చేశానని చెబుతున్నాడని, వీటిపై ప్రభుత్వం నిషేధం విధించాలని దుగ్గిరాలకు చెందిన మన్నవ సత్యనారాయణ వంటివారు డిమాండ్ చేశారు. భాషా పరిశోధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పరిశోధనలో శోధన మాత్రమే మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యం బతకాలని, మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని రచయితలు నొక్కిచెప్పారు. దిల్లీకి చెందిన ప్రబల జానకీదేవి మాట్లాడుతూ, ఓ పుస్తకాన్ని చదవగానే సంతృప్తి రావాలని, విలువలు లేని అక్షరాలను రాయవద్దని యువ రచయితలకు ఆమె పిలుపునిచ్చారు. రచనల్లో, కథల్లో ఆత్మహత్యలు వంటి నెగెటివ్ టచ్ ఉన్న అంశాలను ప్రస్తావించరాదని చెప్పారు.
తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా భాషోద్యమ సదస్సు ఉత్సాహంగా సాగింది. భాషోద్యమ సదస్సుకు తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, గౌరవ అతిథులుగా ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు, మునిరత్నం నాయుడు, అమ్మనుడి సంపాదకులు సామల రమేశ్ బాబు, తులసీనాథం నాయుడు, సకిలి సుధారాణి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో తెలుగు ప్రాథికార సంస్థను ఏర్పాటు చేసిన్పప్పటికీ ఫలితం లేదని ఈ సందర్భంగా తెలిపారు. కవులు, రచయితలు ఓ జాతిని తయారుచేసే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని, అలాంటిది మాతృభాష ఉనికి కోల్పోయినప్పుడు ఉద్యమించక తప్పదని వక్తలు అభిప్రాయపడ్డారు.
భాష పరిరక్షణకు తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలి: జస్టిస్ ఎన్వీ.రమణ
ఎన్టీఆర్ తెలుగులోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని నాడు ఆదేశాలు జారీ చేశారని, తర్వాత ఈ స్పూర్తి నీరుగారిపోయిందని వాపోయారు. మాతృభాష సక్రమంగా అమలు కాకపోవడానికి ప్రభుత్వాలది తప్పు ఉందని, మాతృభాషను రక్షించుకునేందుకు ప్రభుత్వాల వెంట పడాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు. 14 దేశాల్లో లక్షా35వేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని, ఈ స్పూర్తి రాష్ట్రంలో కొరవడిందని రచయితలు అభిప్రాయపడ్డారు. ఇంట్లోనూ మాతృభాషను విరివిగా వాడాలని అప్పుడే పిల్లలకు సులువుగా మాతృభాష వస్తుందని వారు సూచించారు. మాతృభాషను బతికించుకోవడానికి రచయితలు, కవులు, మీడియా ప్రధానపాత్ర పోషించాలని, అదే సమయంలో ప్రభుత్వాలు సైతం చేయూత అందించాలని రచయితలు ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు.
భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో వక్తలు