నాసిరకం మద్యాన్ని కప్పి పుచ్చడానికి.. ప్రభుత్వం అనేక రకాలుగా మభ్యపెడుతోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో. ఒకే బాటిల్లోని నాసిరకం మద్యం తాగిన కొద్ది గంటల్లోనే.. ఇద్దరు చనిపోయారని ఆరోపించారు. హడావిడిగా మృతుల పోస్టుమార్టం రిపోర్టు చేయించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది : చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి సౌదాఘర్ వీధికి చెందిన మస్తాన్ షరీఫ్ (52), అంకమ్మపార్కు ప్రాంతానికి చెందిన బషీర్ అహ్మద్ (35) స్నేహితులు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కలిసి తరచూ మద్యం తాగుతుంటారు. కృష్ణమహల్ కూడలిలో సోమవారం ఉదయం 8.30 సమయంలో ఒక దుకాణం దగ్గర ఇద్దరూ మద్యం తాగుతూ కూర్చున్నారు. ఉన్నట్లుండి మస్తాన్ షరీఫ్‌కు ఫిట్స్‌లాగా వచ్చి పడిపోయాడు. అతడిని చూసి బషీర్ అహ్మద్ పడిపోయాడు. చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరినీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమంగా మారడంతో కాటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమవారు వడదెబ్బతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఏ కారణంతో చనిపోయారో వైద్య నివేదిక వచ్చాక తెలుస్తుందని సీఐ జి.రాజేశ్వరరావు చెప్పారు.
ఇదీ చదవండి:మద్యం తాగుతూ కుప్పకూలారు.. మృతిపై అనుమానాలు