TDP Activist Jallaiah Murder in Palandu District: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శనివారం రోజంతా ఉద్రిక్తత నెలకొంది. తెదేపా కార్యకర్తల ఆందోళనలు, పోలీసుల అణచివేతతో క్షణక్షణం ఉత్కంఠ రేగింది. ప్రత్యర్థుల చేతిలో శుక్రవారం హత్యకు గురైన దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన తెదేపా కార్యకర్త కంచర్ల జల్లయ్య (38) మృతదేహం తరలింపులో పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. మృతదేహాన్ని తమ అనుమతి లేకుండానే శవపరీక్ష నిమిత్తం పోలీసులు వైద్యశాలకు తరలించారని బంధువులు ఆందోళనకు దిగారు. ఎవరూ రాకుండానే గోప్యంగా శవపరీక్ష పూర్తిచేశారు. జల్లయ్యకు నివాళులు అర్పించడంతో పాటు ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెదేపా త్రిసభ్య కమిటీ ఆసుపత్రికి వస్తుందన్న ప్రకటనల నేపథ్యంలో పట్టణమంతా పోలీసులు మోహరించారు. ఆసుపత్రి పరిసరాల్లో వందల మంది కాపలాగా ఉన్నారు. పోస్టుమార్టం తర్వాత శవాగారం వద్ద జల్లయ్య బంధువులు రోదిస్తుండగానే, పోలీసులు గోప్యంగా మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురానికి తరలించేందుకు ప్రయత్నించారు. కోపోద్రిక్తులైన బంధువులు అడ్డుకోగా, వారిని తోసేసి మృతదేహాన్ని బయటకు తెచ్చారు. స్ట్రెచర్‌పై నుంచి అంబులెన్స్‌లోకి ఎక్కించేటప్పుడు మరోసారి తోపులాట జరిగింది. అంబులెన్స్ బయల్దేరాక, బంధువులు వెంట రాకుండా పోలీసులు ఆసుపత్రి ప్రధానగేట్లను మూసేశారు. రహదారిలోనూ బారికేడ్లు పెట్టారు.
అడుగడుగునా అడ్డగింతలు.. అరెస్టులు
మృతదేహాన్ని తరలించాక జల్లయ్య కుటుంబసభ్యులు, బంధువులు, తెదేపా నేతలను ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వస్తేనే తాము వెళ్తామని వారు భీష్మించారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా ఒప్పుకోలేదు. వైకాపా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హంతకులను అరెస్టు చేయకుండా బాధితులనే ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మరోపక్క, తెదేపా నేతలను ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. తెలంగాణ వైపు నుంచి వస్తున్న జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రను రాష్ట్ర సరిహద్దు దాచేపల్లి వద్ద అరెస్టు చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గురజాల మండలం తేలుకుంట్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో బ్రహ్మారెడ్డిని గృహనిర్బంధం చేశారు. బీద రవిచంద్రను సంతమాగలూరు వద్ద అరెస్టు చేసి వినుకొండకు తరలించారు. నరసరావుపేట ఆసుపత్రి వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరవిందబాబును అరెస్టుచేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను పెదకూరపాడులో అదుపులోకి తీసుకున్నారు.
అంబులెన్స్‌లోనే మృతదేహం
శవంతో అంబులెన్స్ ఉదయం 11గంటల కల్లా రావులాపురానికి రాగా, మృతదేహాన్ని తీసుకునేందుకు అక్కడ బంధువులెవరూ ముందుకురాలేదు. హతుడి కుటుంబ సభ్యులందరినీ పేట ఆసుపత్రిలోనే ఉంచి గేట్లు వేయడంతో వారు సకాలంలో చేరుకోలేకపోయారు. గత్యంతరం లేక పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆసుపత్రి నుంచి మధ్యాహ్నం 2గంటలకు కుటుంబసభ్యులను రావులాపురం తీసుకువచ్చారు. ఆ క్రమంలో మహిళలు వాహనంలోకి ఎక్కేందుకు నిరాకరించడంతో వారిపై పోలీసులు భౌతికంగా దాడి చేశారు. తెదేపా నేతలు వచ్చేవరకు అంత్యక్రియలు చేయమని కుటుంబసభ్యులు స్పష్టం చేయడంతో మృతదేహం అంబులెన్స్‌లోనే ఉండిపోయింది. జీవీ ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి రావడానికి పోలీసులు సాయంత్రం 4 గంటలకు అంగీకరించారు. చివరకు సాయంత్రం 5గంటలకు అంత్యక్రియలకు పూనుకోగా.. రాత్రివేళ దహనసంస్కారాలు పూర్తిచేశారు.
తెదేపా రూ.25 లక్షల సాయం
జల్లయ్య కుటుంబానికి తెదేపా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. హతుని పిల్లలు ముగ్గురికి ఎన్టీఆర్ ట్రస్టు పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తామని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేశ్వరరావు ప్రకటించారు. మృతుడి తల్లి అంజమ్మను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అన్నివిధాలా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తమ కుమారుడిని కాపు కాచి హతమార్చారని, ఊరొదిలి వెళ్లినా వదిలిపెట్టలేదని మృతుడి తల్లిదండ్రులు అంజమ్మ, పెదరాముడు కన్నీటిపర్యంతమయ్యారు. భార్య నాగలక్ష్మిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
ఇదీ చదవండి: