Bike thieves in Sattenapally: ఆరు నెలల్లో వివిధ ప్రాంతాలలో 55 వాహనాలను దొంగిలించారు. వాటిపై వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేద్దామనుకున్నారు. చివరకు పోలీసులు తనిఖీల్లో పట్టుబడి కటకటాల పాలయ్యారు ఆ ముగ్గురు దొంగలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ క్రాస్ రోడ్డు వద్ద గ్రామీణ ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వాహనాలపై వస్తున్నారు. తనిఖీలను చూసి పారిపోతుండగా గుర్తించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.
వారిని విచారించగా గత మార్చి నెల నుండి ఇప్పటి వరకూ గుంటూరు, పల్నాడు జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో 55 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు వెల్లడించారు. వాటిని మూడు డంపులుగా విభజించి శివపురం తండా, గుల్కకొండ, బొడుకొండ అటవీ ప్రాంతాలలో 55 ద్విచక్ర వాహనాలను ఉంచినట్లు తెలిపారు. మరో 5 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన అనంతరం.. ముగ్గురూ సమానంగా 20 బైక్ల చొప్పున పంచుకుందామనకున్నారు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఏదైనా వ్యాపారం చేసుకుందామని చోరీలకు పాల్పడ్డినట్లు తెలిపారన్నారు.
బైక్ల చోరీలకు పాల్పడ్డ నిందితులు రాజుపాలెం మండలం ఉప్పలపాడుకు చెందిన వేల్పుల పేరయ్య (30), వేల్పుల గోపి (22), జంపు వెంకటేశ్వర్లు (30)లుగా పోలీసులు తెలిపారు. వీరంతా గుంటూరులోని మిర్చి యార్డులో పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని వివరించారు. వారి నుంచి రూ.23.50 లక్షల విలువ చేసే 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నింధితులను చాకచక్యంగా పట్టుకున్న సత్తెనపల్లి గ్రామీణ ఎస్సై బాలకృష్ణతోపాటుగా సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇవీ చదవండి: