Minister Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబుపై ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు వేంపాటి విజయలక్ష్మి మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధినైనా తనకు తెలియకుండానే గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అందులో మంత్రి అనుచరుల పాత్ర ఉందని ఈమె ఆరోపించారు. గ్రామంలోని పాఠశాలలో ట్యాబ్‌లు పంపిణీ చేశారని.. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు అనుచరులైన రాయపాటి పురుషోత్తం, రైతు సలహామండలి సభ్యులు కళ్లం విజయ్ భాస్కర్ రెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేశారని ఆమె అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో నిర్వహించే వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. తనను ట్యాబ్‌ల పంపిణీకి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రిపై విమర్శల వర్షం గుప్పించారు.
మంత్రిని గెలిపించటానికి కష్టపడ్డామని.. అంతేకాకుండా సొంత డబ్బులు ఖర్చు చేసి విజయం కోసం పనిచేశామని అన్నారు. మంత్రికి కనీసం ఆ కృతజ్ఞత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె మంత్రిపై విమర్శలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్పందించి వివరణ ఇచ్చారు. పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తున్నామని.. సరైన గుర్తింపు ఇవ్వకపోవటం వలనే ఆరోపణలు చేశానని ఆమె తెలిపారు.
"మేము చాలా ఖర్చు పెట్టి అంబటి విజయానికి కృషి చేశాము. పురుషోత్తం, భాస్కర్‌రెడ్డి వచ్చి మా ఊళ్లో పెత్తనాలు చెలయిస్తున్నారు. దాదాపు 30 లక్షల వరకు ఖర్చు చేశాము. కనీసం ఒక్క పని కూడా కావటం లేదు. మా పిల్లల్ని చదివించుకోవటానికి డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్ని మంత్రి కార్లు కొనటానికి మా ఆయన ఖర్చు పెట్టారు. ఇప్పుడు కనీసం పిల్లల చదువులకు డబ్బులు లేవు." - వేంపాటి విజయలక్ష్మి, పెదమక్కెన ఎంపీటీసీ
ఇవీ చదవండి :