Taliban rule in the state: రాష్ట్రంలో తాలిబాన్ల పాలన నడుస్తోందని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో జగన్ సీఎంగా రాష్ట్రంలో బీభత్సం సృష్టించారని... ఆర్థిక నేరగాడి చేతిలో రాష్ట్రం విలవిల్లాడుతుందని ఆరోపించారు. గుంటూరులో మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన యరపతినేని... రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలపై జిల్లా యంత్రాంగం స్పందించడం లేదని విమర్శించారు.
అధికార పార్టీ అనుచరులుగా పోలీసులు... ఏపీలో పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారని... ఓ నిందితుడికి అధికారులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసు అధికారులు కొందరు అధికారపార్టీ అనుయాయులుగా మారిపోయారని.. పోలీసు అధికారులు ముసుగు తొలగించుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడును వైఎస్సార్సీపీ నేతలు రావణకాష్టంగా మార్చారని... అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి కులం, పార్టీని ఆపాదించారని.... రాజధాని మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారులతో భవిష్యత్తులో క్షమాపణలు చెప్పిస్తానని యరపతినేని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వైఖరిపై బ్రహ్మారెడ్డి మండిపడ్డారు.
తాడికొండలో 35వేల ఎకరాలు రైతులు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. రాజధానిని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నామని అన్నారు. కానీ, గెలిచిన తర్వాత విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రజా వేదికను కూల్చేశారు. రాజధానికి పార్టీని, కులాన్ని అంటగట్టారు. విధ్వంసం చేసి భవనాలు, రోడ్లు కూల్చేశారు. మట్టితో సహా తరలించుకుపోయారు. రాష్ట్రంలో సైకో పాలన తాలిబన్ల పాలనను మరిపిస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. విశాఖ పేరుతో అక్కడి భూములను కాజేశారు. గుట్టలకు గుండుకొట్టేశారు. మేం అభివృద్ధి చేస్తే.. వైఎస్సార్సీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారు. సైకో కారణంగా రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దిగజారింది. - యరపతినేని శ్రీనివాసరావు, గురజాల మాజీ ఎమ్మెల్యే
కనకపు సింహాసనమున శునకం కూర్చున్నట్లుగా... ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఉచిత, అనుచితాలను మరిచి బూతులు మాట్లాడుతున్నారు. మాచర్ల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. భాష నువ్వు పుట్టకముందే ఉంది. కానీ, మాకు మా నాయకులు, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది. అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అధికారులపై, మీడియాపై దాడులు చేస్తున్నారు. రామోజీరావు గారి నీడను కూడా తాకే అర్హత లేకున్నా విమర్శిస్తున్నారు. మాచర్లలో చంద్రబాబును పోటీ చేయాలని సవాల్ విసురుతున్న నువ్వు.. కుప్పంలో పోటీ చెయ్.. ఎత్తి చెత్తకుప్పలో పడేస్తారు. ఓటమి భయం వెంటాడుతుంది కాబట్టే.. రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతిని తీసుకొచ్చారు. పోలీస్, ఎక్సైజ్, పంచాయతీ, రెవెన్యూ, వాలంటీర్ల ద్వారా ఒత్తిడి తెచ్చి పనిచేయించుకుంటున్నారు. - బ్రహ్మారెడ్డి, మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్